PM Modi Attack On Congress : అవినీతి, నేరాలు, బుజ్జగింపు రాజకీయాల విషయంలో రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం తనకంటూ ఒక కొత్త గుర్తింపు తెచ్చుకుందని ప్రధాని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని 'లూట్ కీ దుకాణ్' 'ఝూట్ కా బజార్' (దోపిడీ దుకాణం, అబద్ధాల బజార్)గా ఎద్దేవా చేశారు. త్వరలోనే జరిగే ఎన్నికల్లో గెహ్లోత్ సర్కార్ ఓడిపోవటం ఖాయమని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. రాజస్థాన్‌లోని బికనేర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఈ మేరకు ప్రధాని మోదీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
''మహిళలపై జరుగుతున్న అకృత్యాల్లో రాజస్థాన్ అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ రక్షించాల్సిన వాళ్లే మోసగిస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్న వారు అత్యాచార నేరస్థులను రక్షించే పనిలో ఉన్నారు. అవినీతి, నేరాలు, బుజ్జగింపు రాజకీయాలతో అశోక్ గహ్లోత్ ప్రభుత్వం తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. గడిచిన నాలుగేళ్లలో రాజస్థాన్‌ను కాంగ్రెస్ పార్టీ నాశనం చేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఈ దేశాన్ని గుల్ల చేస్తుందని.. అధికారంలో లేకపోతే ఆ పార్టీ నేతలు విదేశాలకు వెళ్లి దేశాన్ని తిడుతుంటారు"
--నరేంద్ర మోదీ, భారత ప్రధానమంత్రి
Modi On Congress : కాంగ్రెస్ పార్టీ అంటేనే ఓ 'దోపిడీ దుకాణం' అని, 'అబద్ధాల బజార్' అంటూ ప్రధాని మోదీ ఎద్దేవాచేశారు. 'విద్వేష మార్కెట్‌లో ప్రేమ దుకాణం తెరిచాం' అంటూ తరచూ రాహుల్ గాంధీ ఉపయోగించే వ్యాఖ్యలపై ఈ విధంగా తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు మోదీ. రాజస్థాన్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. అందుకే ఎన్నికలు సమీపిస్తున్న వేళ తప్పుడు హామీలు, వాగ్ధానాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు. కాగా ఈ ఏడాది చివర్లో రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
బికానేర్‌లో 24 వేల 300కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మెరుగైన కనెక్టివిటీ.. రాజస్థాన్ పర్యటకానికి ఊతం ఇచ్చేలా యువత, రైతులు, వ్యాపారులకు మేలు జరగనుందన్నారు. జల్ జీవన్ మిషన్‌లో అగ్రస్థానంలో ఉండాల్సిన రాజస్థాన్ గహ్లోత్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల.. వెనుకబడిన రాష్ట్రాల జాబితాలో చేరిందని ప్రధాని మోదీ దుయ్యబట్టారు.
వర్షంలోనూ ఆగని అభిమానం..
బికానేర్‌లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన తర్వాత, ప్రధాని మోదీ బహిరంగ ర్యాలీలో ప్రసంగించడానికి వెళుతున్నప్పుడు రోడ్ షో నిర్వహించారు. ఆ రోడ్‌షోలో ప్రధాని కాన్వాయ్‌తో పాటు పెద్ద సంఖ్యలో సైక్లిస్టులు హాజరయ్యారు. వర్షం పడుతున్నా లెక్కచేయకుండా మోదీ కాన్వాయ్‌కు ఇరువైపులా సైకిల్ తొక్కుతూ ఆయనతో కలిసి వెళ్లారు.