Congress Leadership Crisis: ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో పురాతన పార్టీ కాంగ్రెస్ గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నట్లు తాజా ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి. గెలిచే అవకాశం ఉన్న ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపుర్‌లలో ఏమాత్రం పోటీ ఇవ్వకుండా చేతులెత్తేయడం ఆ పార్టీ దైన్య స్థితికి అద్దంపడుతోంది. ఒకరకంగా తాజా ఫలితాలు ఆ పార్టీ భవిష్యత్తునూ దెబ్బకొట్టాయని విశ్లేషకులు చెబుతున్నారు. వయోభారంతో ఉన్న అధ్యక్షురాలు, స్పష్టమైన వ్యూహంలేని యువనేతలు, అసంతృప్తిగా ఉన్న సీనియర్లు.. ఇలా ఎన్నో కారణాలు కాంగ్రెస్‌ను ఈ స్థితికి తీసుకొచ్చాయి. పార్టీ అధినాయకత్వంలో నిర్ణయాలు తీసుకొనే సత్తా లోపించడం, ప్రత్యర్థుల ఎత్తుగడలను అంచనావేసి, వాటిని ఎదుర్కొనే వ్యూహాలను రచించే సామర్థ్యాలు లేకపోవడం ఆ పార్టీకి శరాఘాతమయ్యాయి. ప్రస్తుతం కాంగ్రెస్ చేతిలో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ మాత్రమే మిగిలాయి. ఇప్పటికే ఆ పార్టీ అధినాయకత్వంపై అనేక మంది నాయకులు, కార్యకర్తలు నమ్మకాన్ని కోల్పోయారు. తాజా ఫలితాలతో వారు పార్టీలో కొనసాగడం అనుమానమేనని, అది కాంగ్రెస్ పరిస్థితిని మరింత దిగజారుస్తుందని చెబుతున్నారు. నేటితరం యువతకు గాంధీ కుటుంబ నేపథ్యం గురించి తెలియదని, అందువల్ల ఇదే తరహాలోనే రాజకీయాలు చేస్తూ పోతే కాంగ్రెస్ ఓటర్లు పెరిగే అవకాశం లేదని పేర్కొంటున్నారు.
Congress Results
ఎందుకిలా?
పంజాబ్‌లో పరిస్థితులు ముదిరిపోయేంతవరకు వేచి చూశాక అమరీందర్ సింగ్‌ను తొలగించడం, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఏ సామాజికవర్గాన్నీ దగ్గర చేర్చుకోలేకపోవడం, ఉత్తరాఖండ్‌లో బలమైన నాయకత్వాన్ని తయారు చేసుకోలేకపోవడం కాంగ్రెస్‌ను దెబ్బతీశాయి. మణిపుర్‌లో మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఓక్రం ఐబోబిసింగ్ ఆధ్వర్యంలో పోరాడిన కాంగ్రెస్.. 2017 కంటే తక్కువ స్థానాలకు పడిపోయింది. గోవాలోనూ మునుపటి కన్నా తక్కువ సీట్లతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. కాంగ్రెస్ ఒకసారి అధికారం పోగొట్టుకున్న తర్వాత దాన్ని మళ్లీ చేజిక్కించుకోవడం కష్టంగా ఉంది. అందుకు ఉదాహరణ పశ్చిమబెంగాల్, ఒడిశా, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, బిహార్, ఝార్ఖండ్, హరియాణా వంటి రాష్ట్రాలే.
ఆకట్టుకునే నేతలు కరవు
కాంగ్రెస్‌లో ప్రజాకర్షక నాయకులు కరవయ్యారు. ఏళ్ల తరబడి కొందరు నాయకులమీదే ఆ పార్టీ ఆధారపడుతోంది. ఈ పార్టీలో ప్రస్తుతం పదవులు అనుభవిస్తున్న సీనియర్ నేతలు బయటికెళ్లి ప్రచారం చేయలేని పరిస్థితి ఉంది. పార్టీ నిర్ణయాధికారాలపై ప్రభావం చూపగలిగే మల్లికార్జున ఖర్గే, చిదంబరం, ఆంటోనీ, దిగ్విజయ్‌సింగ్, జైరాం రమేశ్ లాంటివారంతా ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నవారే. వీరు పార్లమెంటులో కానీ, బయట కానీ భాజపాను ఇరుకునపెట్టేంత వ్యూహ చతురతతో వ్యవహరించకపోవడంవల్ల కాంగ్రెస్ ప్రభావవంతమైన పార్టీ అన్న నమ్మకాన్ని ప్రజల్లో కల్పించలేకపోతోంది.
కొత్త నాయకత్వం ఎక్కడ?
2020 జులైలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తర్వాత పూర్తిస్థాయి అధ్యక్షులను ఎన్నుకోలేని అనిశ్చితిలో కాంగ్రెస్ కొట్టుమిట్టాడుతోంది. వయోభారంతో ఉన్న సోనియా గాంధీ ఈసారి ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకత్వాల బలంతో ఎలాగోలా లాక్కుంటూ వచ్చింది. పంజాబ్‌లో అమరీందర్ సింగ్, రాజస్థాన్‌లో అశోక్ గహ్లోత్, మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్, ఛత్తీస్‌గఢ్‌లో భూపేష్ భఘేల్, టీఎస్ సింగ్‌దేవ్‌లాంటి వారి కారణంగా విజయాలు సాధించింది తప్పితే అధినాయకత్వం వ్యూహ చతురత వల్ల కాదనేది సర్వత్రా వినిపించే మాట. వారిని పక్కనపెట్టి పార్టీని గెలిపించుకొనే యువనేతలు లేకపోవడం కాంగ్రెస్ భవిష్యత్తును అగమ్యగోచరంగా మారుస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.