కేరళ ఎన్నికల అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ ఆదివారం విడుదల చేయనుంది. మొత్తం 91 మంది పేర్లను ప్రకటించనుంది. ఈ విషయాన్ని కేరళ పీసీసీ అధ్యక్షుడు ముల్లపల్లి రామచంద్రన్, అసెంబ్లీ ప్రతిపక్ష నేత రమేశ్ చెన్నితల, మాజీ ముఖ్యమంత్రి ఉమన్ చాందీ శుక్రవారం స్పష్టం చేశారు.
"ఇప్పటివరకు 81 మంది పేర్లు ఖరారు అయ్యాయి. మిగతా పది మంది పేర్లను పరిశీలించి తుది జాబితాను ఆదివారం ప్రకటిస్తాం. ఏ అభ్యర్థికీ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అవకాశం కల్పించం. అంతర్గత గొడవలకు అవకాశమే లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్, కూటమి కూడా ఐక్యంగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో మా కూటమి కచ్చితంగా విజయం సాధిస్తుంది."
-ముల్లపల్లి రామచంద్రన్, పీసీసీ అధ్యక్షుడు
2016 నుంచి భాజపా కంచుకోటగా మారిన నెమమ్ నియోజకవర్గంలో విజయంపై కాంగ్రెస్ దృష్టి సారించింది. ఈసారి ఆ నియోజకవర్గంలో పోటీకి బలమైన అభ్యర్థులకే అవకాశం కల్పించనున్నామని అసెంబ్లీ ప్రతిపక్ష నేత రమేశ్ చెన్నితల వెల్లడించారు. అభ్యర్థులుగా చెన్నితల లేదా ఉమన్ చాందీలకు పార్టీ అవకాశం ఇస్తుందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఇతర పార్టీలకు..
కూటమిలో ఐయూఎంల్కు 27 సీట్లు, కేరళ కాంగ్రెస్ (జోసెఫ్)కు 10 సీట్లు, ఆర్ఎస్పీకి 5 సీట్లు, నేష్నలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కేరళకు 2 సీట్లను కాంగ్రెస్ కేటాయించింది. కేరళ కాంగ్రెస్ (జాకోబ్), భారతీయ నేషనల్ జనతా దళ్, కమ్యూనిస్ట్ మార్క్సిస్ట్ పార్టీ (సీఎంపీ)కి చెరో ఒక స్థానాన్ని ఇచ్చింది.
ఇదీ చదవండి :బంగాల్, అసోం, కేరళలో మోదీ, షా సుడిగాలి పర్యటన