Karnataka CM : కర్ణాటకలో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో సీఎల్‌పీ నేతగా సిద్ధరామయ్య పేరును కాంగ్రెస్ శాసనసభా పక్షం ఏకగ్రీవంగా ఆమోదించింది. బెంగళూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం సాయంత్రం జరిగిన సీఎల్‌పీ సమావేశంలో సిద్ధరామయ్య పేరును పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ప్రతిపాదించారు. ఆ తర్వాత కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేంతా సిద్ధరామయ్య పేరును ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సమావేశంలో ఎవరెవరికి ఏయే మంత్రిత్వ శాఖ ఇవ్వాలనే దానిపై కూడా చర్చలు జరిగినట్లు సమాచారం. రాష్ట్రంలో ఈసారి కేవలం ఒక్కరికే ఉపముఖ్యమంత్రిగా అవకాశం రావడం వల్ల మిగతా సీనియర్ ఎమ్మెల్యేలంతా తీవ్ర నిరాశకు గురయ్యారని తెలుస్తోంది.
సీఎల్‌పీ నేత హోదాతో పాటు సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా ఎన్నుకన్నట్లు ఇదే సమావేశంలో అధికారికంగా ప్రకటించారు. ఈ కార్యక్రమానికి కొత్తగా ఎన్నికైన 135 మంది ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు, ఎంపీలు సహా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు రణదీప్ సింగ్ సూర్జేవాలా, జితేంద్ర, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ శిందే పాల్గొన్నారు. కేవలం 20 నిమిషాల్లోనే సీఎల్‌పీ సమావేశం ముగిసింది.
గవర్నర్‌ను కలిసిన నేతలు
సీఎల్‌పీ సమావేశం ముగిసిన అనంతరం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ సహా పార్టీ ముఖ్య నేతలంతా రాజ్‌భవన్ వెళ్లి గవర్నర్ థావర్‌చంద్ గెహ్లోత్‌ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతిని కోరుతూ.. ప్రమాణస్వీకారానికి హాజరుకావాలని మెజారిటీ శాసనసభ్యులు చేసిన సంతకాలతో కూడిన లేఖను ఆయనకు సమర్పించారు. అనంతరం గవర్నర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభకాంక్షలు తెలిపారు.