Karnataka election results 2023 : కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ కట్టబెట్టిన కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కృతజ్ఞతలు తెలిపారు. ఇది కర్ణాటక ప్రజల విజయమని రాహుల్ కొనియాడారు. తాము ద్వేషం, చెడు పదాలు ఉపయోగించకుండా కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేసినందుకు సంతోషంగా ఉన్నానని ఆయన అన్నారు. ప్రేమతోనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోరాడిందని పేర్కొన్నారు.
"కర్ణాటకలో విద్వేష బజార్ మూతబడింది. ప్రేమ దుకాణం తెరుచుకుంది. ఇది అందరి విజయం. ముఖ్యంగా కర్ణాటక ప్రజల విజయం. మేం ఎన్నికల్లో 5 హామీలు ప్రజలకు ఇచ్చాం. మొదటి కేబినెట్ సమావేశంలోనే వాటిని అమల్లోకి తెస్తాం. కర్ణాటక ప్రజలకు మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు చెబుతున్నాను."
--రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
దేశాన్ని ఏకం చేసే విజయం..
కర్ణాటకలో పార్టీ విజయంపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ స్పందించారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ పనితీరు.. దేశాన్ని ఏకం చేసే రాజకీయాల విజయమని ఆమె అభిప్రాయపడ్డారు. 'కాంగ్రెస్ పార్టీకి చారిత్రక విజయాన్ని అందించినందుకు కర్ణాటక ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు. పార్టీ విజయం కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలు, నాయకులు అందరికీ నా శుభాకాంక్షలు. మీ కష్టానికి తగ్గ ఫలితం లభించింది. ప్రజలకు ఇచ్చిన హామీలకు నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. జై కర్ణాటక.. జై కాంగ్రెస్' అని ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు.
మోదీ శుభాకాంక్షలు..
కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. 'కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చిన వారందరికీ ధన్యవాదాలు. పార్టీ కార్యకర్తల కృషిని అభినందిస్తున్నా. రాబోయే కాలంలో మరింత శక్తితో కర్ణాటకకు సేవ చేస్తాం' అని ట్వీట్ చేశారు.
బీజేపీ ఓటమికి నాదే బాధ్యత: బొమ్మై
కర్ణాటక ప్రజల ఇచ్చిన తీర్పును అంగీకరిస్తున్నట్లు సీఎం బసవరాజ్ బొమ్మై తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నుంచి పార్టీ కార్యకర్తల వరకు అంతా శ్రమించినా కూడా సానుకూల ఫలితాలు రాలేదన్నారు. మొత్తం ఫలితాలను విశ్లేషించి లోపాలను సరిదిద్దుకొని.. 2024 పార్లమెంటు ఎన్నికలకు సమాయత్తం కానున్నట్లు బొమ్మై చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ పరాజయానికి తానే బాధ్యత తీసుకుంటున్నట్లు బొమ్మై ప్రకటించారు. ఎన్నికల్లో ఓటమికి అనేక కారణాలున్నాయని తెలిపారు. వాటన్నింటిని తెలుసుకుని.. పార్లమెంటు ఎన్నికల నాటికి పార్టీని మరోసారి బలోపేతం చేస్తామని పేర్కొన్నారు.
'ప్రధాని నుంచి పార్టీ కార్యకర్తల వరకు అందరం తీవ్రంగా శ్రమించినా కూడా మేం మెజార్టీ సాధించలేకపోయాం. కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సాధించింది. మొత్తం ఫలితాలు వచ్చాక విశ్లేషణ చేసుకుంటాం. ఎక్కడా లోపాలు ఉన్నాయో చూస్తాం. వివిధ స్థాయిలో ఏం జరిగిందో తెలుసుకుని సరిదిద్దుకుంటాం'