నేరపూరిత పరువు నష్టం కేసులో గుజరాత్‌లోని సూరత్ కోర్టు విధించిన శిక్షను సవాలు చేస్తూ కాంగ్రెస్ అగ్రనేత సోమవారం సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఏప్రిల్ 13 వరకు బెయిల్‌ను పొడగించింది. అదే రోజు తదుపరి విచారణ జరపనున్నట్లు వెల్లడించింది. సూరత్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాహుల్ రెండు పిటిషన్లు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. మొదటిది రెగ్యులర్ బెయిల్ కోసం కాగా.. దోషిగా తేల్చడాన్ని సవాల్ చేస్తూ రెండో పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్‌పై సానుకూలంగా స్పందించిన కోర్టు.. ఫిర్యాదుదారుడు పూర్ణేశ్ మోదీకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జరిగే ఏప్రిల్ 13న రాహుల్ ప్రత్యక్షంగా హాజరు కావాల్సిన అవసరం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది.
రెండో పిటిషన్లో రాహుల్‌కు అనుకూలంగా తీర్పు వస్తే.. లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ అవుతుంది. రాహుల్ వెంట సోదరి ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేతలతో పాటు ఆ పార్టీ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సుఖ్విందర్ సుఖు(హిమాచల్), భూపేశ్ బఘేల్(ఛత్తీస్‌గఢ్), అశోక్ గహ్లోత్(రాజస్థాన్)లు సూరత్ కోర్టుకు వచ్చారు.
కోర్టులపై ఒత్తిడి చేస్తున్నారు: బీజేపీ
కాంగ్రెస్ అగ్రనేతలంతా కోర్టుకు వెళ్లిన నేపథ్యంలో బీజేపీ మాటల దాడికి దిగింది. కాంగ్రెస్ పార్టీకి దేశం కంటే ఒక కుటుంబమే ముఖ్యమని బీజేపీ ఎద్దేవా చేసింది. న్యాయ ప్రక్రియకు ఓ పద్ధతి ఉంటుందని, న్యాయస్థానాలపై ఒత్తిడి తెచ్చేందుకే పార్టీ నేతలు భారీగా సూరత్‌కు చేరుకుంటున్నారని విమర్శించింది. ఒక రాజకీయ పార్టీ మొత్తం కోర్టును ఘెరావ్ చేయడానికి ప్రయత్నించిన సందర్భం గతంలో ఎప్పుడైనా చూశామా అని కేంద్ర న్యాయ శాఖమంత్రి కిరణ్ రిజిజు.. కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. 'మాజీ ప్రధాని పీవీ నరసింహారావు దోషిగా తేలినప్పుడు కాంగ్రెస్ నిశ్శబ్దంగా ఉంది. కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, డీకే శివకుమార్ బెయిల్‌పై ఉన్నప్పుడు కూడా మద్దతు తెలపలేదు' అని రిజిజు అన్నారు.