అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు 10 శాతం రిజర్వేషన్లు చెల్లుబాటు అవుతాయని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలైంది. ఈ తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ కాంగ్రెస్ నేత జయ ఠాకూర్ బుధవారం సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్ కల్పించడం.. దేశంలో సమానత్వ కోడ్‌ను ఉల్లంఘించడమేనని, ఇది వివక్షకు దారితీస్తుందని పిటిషనర్ పేర్కొన్నారు. మన దేశంలో ఎంతోకాలంగా రిజర్వేషన్లు అమల్లో ఉన్నప్పటికీ.. ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన తరగతులకు కల్పించే మొత్తం రిజర్వేషన్లు కేవలం 47.46శాతమేనని కాంగ్రెస్ నాయకురాలు గుర్తుచేశారు. ఇప్పుడు కేవలం ఈడబ్ల్యూఎస్‌కే 10శాతాన్ని ఎలా కేటాయిస్తారని ఆమె ప్రశ్నించారు. ఈ రిజర్వేషన్ల కోసం చేసిన రాజ్యాంగ సవరణను ఆమోదించే సమయంలో '10శాతం' సంఖ్యపై పార్లమెంట్‌లో ఎలాంటి చర్చ జరగలేదని పేర్కొన్నారు. 103వ రాజ్యాంగ సవరణ.. దేశ రాజ్యాంగ మూల స్వరూపాన్ని మార్చేలా ఉందని పిటిషనర్ అభిప్రాయపడ్డారు. ఈ తీర్పును మరోసారి సమీక్షించాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు.
2019 సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం ఈ రిజర్వేషన్లను తీసుకొచ్చింది. 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో 10% రిజర్వేషన్లు కల్పించింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. రిజర్వేషన్లపై 1992 సుప్రీంకోర్టు విధించిన 50శాతం పరిమితిని దాటి ఈ కోటాను ఎలా ఇస్తారంటూ పలువురు పిటిషనర్లు ప్రశ్నించారు. ఇది రాజ్యాంగం మూల స్వరూపాన్ని ఉల్లంఘించడమే అని ఆరోపిస్తూ వ్యాజ్యాలు దాఖలు చేశారు. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన రాజ్యాంగ ధర్మాసనం.. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సమర్థిస్తూ ఇటీవల తీర్పు వెలువరించింది.