కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జితిన్ ప్రసాద.. భాజపాలో చేరారు. దిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, పార్టీ ప్రతినిధి అనిల్ బలుని సమక్షంలో కాషాయ కండువ కప్పుకున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న సమయంలో ప్రసాద.. భాజపాలో చేరటం ప్రాధాన్యం సంతరించుకుంది.
"కాంగ్రెస్తో మాకు మూడు తరాల అనుబంధం ఉంది. అందువల్ల ఈ నిర్ణయం తీసుకునేందుకు చాలా చర్చించాల్సి వచ్చింది. గత 8-10ఏళ్లుగా జాతీయ పార్టీ ఏదైనా ఉందంటే అది భాజపా మాత్రమే అని నాకు అనిపించింది. దేశ ప్రజల ప్రయోజనాల కోసం పనిచేసే పార్టీ, ప్రజల తరఫున నిలబడే పార్టీ భాజపా. అందుకే నేను ఇందులో చేరాను"
-జితిన్ ప్రసాద
యూపీ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన జితిన్ ప్రసాద.. బంగాల్ కాంగ్రెస్ ఇంఛార్జిగా పని చేస్తున్నారు. ఆయన తండ్రి జితేంద్ర ప్రసాద.. కాంగ్రెస్లో ప్రముఖ నేత. 2004లో షాజహాన్పూర్, 2009లో ధౌరాహ్రా నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు జితిన్. 2008 నుంచి 2009 వరకు అప్పటి యూపీఏ ప్రభుత్వంలో ఉక్కుశాఖ సహాయమంత్రిగా పనిచేశారు. రెండోసారి యూపీఏ ప్రభుత్వంలోనూ పలు శాఖలకు సహాయమంత్రిగా వ్యవహరించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో జితిన్ పార్టీని వీడటం కాంగ్రెస్కు గట్టి దెబ్బే అని చెప్పాలి. మధ్య యూపీ ప్రాంతంలోని బ్రాహ్మణ వర్గంలో జితిన్కు గట్టి పట్టుంది. దీంతో ఆయన రాక.. భాజపాకు మంచి బూస్ట్ ఇచ్చినట్లైంది. కాంగ్రెస్లో విబేధాలు, లోక్సభ ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు ఓటమిపాలవటం.. భాజపాలో చేరేందుకు కారణమైనట్లు సమాచారం.