తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'దేశ వ్యతిరేకులని ముద్ర వేయడం ప్రమాదకరం.. ప్రజాస్వామ్యం ఖతం!' - అంబేడ్కర్​కు నివాళులర్పిస్తున్న ప్రధాని మోదీ

అంబేడ్కర్ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై ఘాటు విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. బలవంతంగా గొంతు నొక్కే సంస్కృతి, ప్రశ్నించేవారిని జాతి విద్రోహకులుగా చిత్రీకరించే పద్ధతి.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేయడం, రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడమే అన్నారు. ఇది దేశానికి ఎంతో ప్రమాదకరం అని ఖర్గే వ్యాఖ్యానించారు. మరోవైపు.. ప్రజాస్వామ్య సూత్రాలకు అంబేడ్కర్ ఛాంపియన్ వంటి వారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కొనియాడారు.

congress mallikarjunkarghe comments on modi
మోదీ సర్కార్​పై కాంగ్రెస్​ ఘాటు విమర్శలు

By

Published : Apr 14, 2023, 11:50 AM IST

Updated : Apr 14, 2023, 1:22 PM IST

అంబేడ్కర్ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీరుపై కాంగ్రెస్‌ ఘాటు విమర్శలు చేసింది. బలవంతంగా గొంతు నొక్కే సంస్కృతి, ప్రశ్నించేవారిని జాతి విద్రోహకులుగా చిత్రీకరించే పద్ధతి ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేయడం, రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడమే.. ఇది దేశానికి ఎంతో ప్రమాదకరం అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. అంబేడ్కర్‌ 132వ జయంతి సందర్భంగా సందేశం ఇచ్చిన ఖర్గే ప్రతిపక్షాల వల్ల కాకుండా ప్రభుత్వం వల్ల చర్చకు బదులుగా పోరాటం చేసే ప్రదేశంగా పార్లమెంటు మారిపోయిందని దుయ్యబట్టారు.

దేశ రాజకీయాల్లో వ్యక్తి పూజపై అంబేడ్కర్‌ ఎప్పుడో హెచ్చరించారని మల్లిఖార్జున గుర్తుచేశారు. దేశంలో కుల వివక్ష, లింగ అసమానతలు, విభజన రాజకీయాలను అంతం చేయడంలో అంబేడ్కర్​ అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. అంతేకాకుండా దేశంలో బ్యాంకింగ్​ రంగం సహా వ్యవసాయం దాని నీటి వనరుల నిర్వహణ కోసం అంబేడ్కర్​ ఎంతో కృషి చేశారని ఖర్గే తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు, న్యాయవ్యవస్థ, మీడియా, సాధారణ పౌరులను మౌనం వహించాలని చెప్పడం.. వారిపై దేశ వ్యతిరేకులుగా ముద్ర వేయడం ప్రమాదకర ధోరణికి దారి తీస్తోందని ఖర్గే వ్యాఖ్యానించారు.

ప్రజాస్వామ్య సూత్రాలకు అంబేడ్కర్ ఛాంపియన్..: రాహుల్​
స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం అనే ప్రజాస్వామ్య సూత్రాలకు అంబేడ్కర్ ఛాంపియన్ వంటి వారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మరోవైపు.. భారతీయులను విభజించేందుకు అధికారాన్ని దుర్వినియోగం చేసేవారే నిజమైన 'దేశ వ్యతిరేకులు' అని కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ ఆరోపణలు చేశారు కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ. అలాగే దేశంలో రాజ్యాంగ వ్యవస్థల అణచివేత కొనసాగుతోందని ఆమె విమర్శించారు. అంబేడ్కర్‌ జయంతి వేళ 'ద టెలిగ్రాఫ్‌'కు వ్యాసం రాసిన ఆమె క్రమబద్ధంగా జరుగుతున్న దాడి నుంచి రాజ్యాంగాన్ని ప్రజలే రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. నిజమైన జాతి విద్రోహకులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి భారతీయులను విడదీస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. రాజ్యాంగ నిర్మాణంపై డాక్టర్ అంబేడ్కర్ తీసుకున్నంత చొరవ ఎవరూ తీసుకోలేదని స్వయంగా మాజీ ప్రధాని నెహ్రూయే చెప్పారని.. కానీ, ప్రస్తుతం ఆ వారసత్వంపై దాడి జరుగోతోందని కాంగ్రెస్​ ఎంపీ జైరాం రమేశ్​ ట్విట్టర్​ వేదికగా పేర్కొన్నారు.

అంబేడ్కర్​కు నివాళులర్పిస్తున్న కాంగ్రెస్​ నేత ప్రియాంక గాంధీ

మహానీయుడికి మోదీ నివాళులు..
భారత రాజ్యాంగ నిర్మాత భీమ్ రావ్ అంబేడ్కర్‌ 132వ జయంతి సందర్భంగా శుక్రవారం పార్లమెంట్ కాంప్లెక్స్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయనకు నివాళులర్పించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖఢ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అంబేడ్కర్​ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సమాజంలోని అణగారిన, దోపిడీకి గురవుతున్న వర్గాల సాధికారత కోసం అంబేడ్కర్‌ తన జీవితాన్ని అంకితం చేశారని.. ఆయన జీవితంపై గతంలో తాను చేసిన వ్యాఖ్యల ఆడియో క్లిప్‌ను పోస్ట్ చేస్తూ ట్వీట్ చేశారు మోదీ.

అంబేడ్కర్​కు నివాళులర్పిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ
Last Updated : Apr 14, 2023, 1:22 PM IST

ABOUT THE AUTHOR

...view details