పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలింది. ఎమ్మెల్యేల వరుస రాజీనామాలతో మైనారిటీలో పడిపోయిన సర్కార్ బలపరీక్షలో విఫలమైంది.
బలనిరూపణ చేసుకోవాలని లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై ఇచ్చిన ఆదేశాలతో ప్రత్యేకంగా సమావేశమైన సభకు హాజరైన ముఖ్యమంత్రి నారాయణసామి.. ప్రభుత్వానికి మెజారిటీ ఉందని అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సభలో ప్రసంగించిన ఆయన.. భాజపా తీరుపై మండిపడ్డారు.
"డీఎంకే సహా స్వతంత్ర ఎమ్మెల్యేలతో కలిపి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లోనూ మేం గెలిచాం. పుదుచ్చేరిలో తాము రెండు భాషల విధానం అమలు చేయగా.. కేంద్రంలోని భాజపా సర్కార్ బలవంతంగా హిందీని రుద్దే ప్రయత్నం చేసింది. కేంద్రం, ప్రతిపక్షాలతో కుమ్మక్కైన మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేదీ తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించారు. నిధులు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం పుదుచ్చేరి ప్రజలను మోసం చేసింది."
-అసెంబ్లీలో నారాయణసామి
అనంతరం తీర్మానంపై ఓటింగ్ నిర్వహించకుండానే... సీఎం నారాయణసామి సహా అధికార కూటమి సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా.. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య సభలో వాగ్వాదం జరిగింది. ఈ గందరగోళం మధ్యే విశ్వాస తీర్మానం వీగిపోయినట్లు స్పీకర్ వీపీ శివకొలుందు ప్రకటించారు. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేశారు.
సభ నుంచి నిష్క్రమించిన నారాయణసామి.. నేరుగా రాజ్‌నివాస్‌కు వెళ్లి తన రాజీనామాను లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసైకి సమర్పించారు.
అంకెల లెక్క
పుదుచ్చేరి అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 33 కాగా... ఐదుగురు కాంగ్రెస్, ఒక డీఎంకే సభ్యుడు రాజీనామా చేయడం, ఒక సభ్యుడిపై బహిష్కరణ వేటుపడటం వల్ల.. ఏడు ఖాళీలు ఉన్నాయి. ఫలితంగా అసెంబ్లీలో 26 మంది సభ్యులు ఉన్నారు. మెజార్టీకి 14 మంది సభ్యుల మద్దతు అవసరం. ఎన్నార్ కాంగ్రెస్, అన్నాడీఎంకే, భాజపాతో కూడినవిపక్ష కూటమికి 14 మంది బలం ఉంది. రాజీనామాల తర్వాత.. స్పీకర్ కాకుండా కాంగ్రెస్-డీఎంకే కూటమి బలం 11కు చేరింది. ఒక స్వతంత్ర సభ్యుడు రామచంద్రన్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతిచ్చారు. మెజార్టీ నిరూపించుకోవడానికి తగిన బలం లేకపోవడంతో ఓటింగ్‌కు ముందే అధికారపక్షం వాకౌట్ చేసింది.