congress foundation day: బలమైన దేశాన్ని నిర్మించేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు ఏళ్ల తరబడి కష్టించి నిర్మించిన దృఢమైన పునాదులను బలహీనపరిచేందుకు విద్వేషం, పక్షపాతంతో కూడిన విభజన సిద్ధాంతాలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయని పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ 137 వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్న సోనియా పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా భాజపాపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
దేశంలోని గంగాజమునా సంస్కృతిని చెరిపి వేయడం సహా చరిత్రను భాజపా నేతలు తప్పుగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. ఈ చర్యలపై కాంగ్రెస్ పార్టీ మౌన ప్రేక్షకుడిలా చూస్తూ ఉండబోదని తెలిపారు. భారత్‌కు ఉన్న ఘనమైన వారసత్వాన్ని అస్థిరపరిచడాన్ని తాము అనుమతించబోమని సోనియా స్పష్టం చేశారు.
"స్వాతంత్య్ర ఉద్యమంలో ఏ రూపంలోనూ పాత్ర లేని విద్వేషం, పక్షపాతంతో కూడిన విభజన సిద్ధాంతాలు.. ఇప్పుడు మన సమాజంలోని లౌకిక వాతావరణానికి ఇబ్బంది కలిగిస్తున్నాయి. తమకు అర్హత లేకున్నా వారు చరిత్రను పునర్ లిఖిస్తున్నారు. భయాన్ని సృష్టిస్తున్నారు. ద్వేషాన్ని వ్యాపింపజేస్తున్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఉన్న గొప్ప సంప్రదాయాన్ని ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేస్తున్నారు. ఈ విధ్వంసక శక్తులపై భారత జాతీయ కాంగ్రెస్ తమ బలం, శ్రేణులతో పోరాటం చేస్తుంది."