Congress Foundation Day : కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా కులగణన చేపడుతామన్నారు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ. దేశంలో నిరుద్యోగ రేటు గత 40 ఏళ్లలో అత్యధిక శాతానికి చేరుకుందని ఆరోపించారు. దేశంలో రెండు భావజాలాల మధ్య యుద్ధం జరుగుతోందని అన్నారు. కాంగ్రెస్ 139వ వ్యవస్థాపకదినోత్సవం సందర్భంగా మహారాష్ట్ర నాగ్‌పుర్‌లో 'హై తయార్ హమ్' (మేం సిద్ధంగా ఉన్నాం) పేరిట ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
"ఇది(నాగ్‌పుర్) కాంగ్రెస్‌పార్టీ గడ్డ. ఇక్కడి ప్రజలకు కాంగ్రెస్ సిద్ధాంతాల గురించి చెప్పకపోయినా అర్థమవుతాయి. కాంగ్రెస్ పోరాటం మహారాష్ట్ర నుంచే మొదలైంది, అందువల్ల మీతో మాట్లాడేందుకు నాగ్‌పుర్ వచ్చాం. మీరు ఎవరికీ భయపడకూడదు. సిద్ధాంతాల కోసం మనస్ఫూర్తిగా చేస్తున్న పోరాటం ఇది. మనమంతా కలిసి మహారాష్ట్రతోపాటు దేశంలో జరిగే ఎన్నికల్లో గెలవబోతున్నాం."
-రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు
'ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రతిపక్షాన్ని బలపరచాలి'
ఇండియా కూటమి ఐక్యంగా ఉంటే దేశంలో భారతీయ జనతా పార్టీ కనుమరుగవుతుందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రతిపక్ష కూటమిని బలపర్చాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్‌పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నాగ్‌పుర్‌లో నిర్వహించిన హై తయ్యార్ హమ్ ర్యాలీలో ఖర్గే ప్రసంగించారు. పార్లమెంటులో అలజడికి సంబంధించి బీజేపీ తమ ఎంపీని కాపాడేందుకు 147 మంది ప్రతిపక్ష ఎంపీలను బయటికి పంపిందని ఖర్గే ఆరోపించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి విజయం సాధిస్తే మహిళలకు సాధికారత కల్పించే న్యాయ్ పథకాన్ని ప్రవేశపెడతామన్నారు. అంతకుముందు దిల్లీలోని ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు ఖర్గే.