కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తనదైన శైలిలో కాంగ్రెస్‌పై దాడికి దిగింది. 70 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో జరిగిన అవినీతిని వివరిస్తూ 'కాంగ్రెస్ ఫైల్స్' పేరుతో ఓ వీడియో విడుదల చేసింది. కాంగ్రెస్ లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని బీజేపీ ట్విట్టర్ వేదికగా ఆరోపించింది. ప్రస్తుతం విడుదల చేసిన వీడియో జస్ట్ ట్రైలర్ మాత్రమేనని.. అసలు సినిమా ఇంకా ముందుంది అని తెలిపింది.
అదానీ వ్యవహారం, రాహుల్ అనర్హత వంటి అంశాలపై విపక్షాలు మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న తరుణంలో.. బీజేపీ పార్టీ.. కాంగ్రెస్‌పై ప్రస్తుతం చేస్తున్న దాడిని మరింత ఉద్ధృతం చేసింది. కాంగ్రెస్ పాలనలో ఎంత అవినీతి జరిగిందనే విషయాన్ని వెల్లడిస్తూ.. ఆదివారం ఉదయం 'కాంగ్రెస్ ఫైల్స్' పేరుతో ఓ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ''కాంగ్రెస్ ఫైల్స్' మొదటి ఎపిసోడ్లో కాంగ్రెస్ పాలనలో అవినీతి, కుంభకోణాలు ఒకదాని తర్వాత ఒకటి ఎలా జరిగాయో చూడండి' అని బీజేపీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 70 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి.. లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని ఆరోపించింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అవినీతి కారణంగానే దేశం వెనుకబడి ఉందని వెల్లడించింది.