తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆజాద్​ రాజకీయ ప్రస్థానం, విధేయుడిగా మొదలై తిరుగుబాటుదారుడిగా - jammu kashmir leaders

Ghulam Nabi Azad political career గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉన్న గులాం నబీ ఆజాద్‌ అనూహ్యంగా ఆ పార్టీపైనే తీవ్ర విమర్శలు గుప్పిస్తూ తిరుగుబాటుదారుగా ముద్రవేసుకున్నారు. ఇప్పుడు రాజీనామా రూపంలో పార్టీతో అనుబంధాన్ని తెంచుకున్నారు. ముఖ్యమంత్రి నుంచి కేంద్ర మంత్రివరకు వివిధ హోదాల్లో కొనసాగిన ఆజాద్‌ రాజకీయ ప్రస్థానం ఇదీ.

nabi azad
నబీ ఆజాద్​

By

Published : Aug 27, 2022, 11:21 AM IST

Updated : Aug 27, 2022, 9:52 PM IST

Ghulam Nabi Azad Political Career: సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీలో అయిదు దశాబ్దాలపాటు కొనసాగిన కీలక నేత ఆయన.. పార్టీని సంక్షోభాల నుంచి గట్టెక్కించడంలో తన పాత్ర కీలకం. పార్టీకి చిక్కులు ఎదురైనప్పుడల్లా అధిష్ఠాన దూతగా పరిష్కరించిన రాజకీయ చతురత ఆయన సొంతం.. మొదటి నుంచీ గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉన్న గులాం నబీ ఆజాద్‌.. అనూహ్యంగా ఆ పార్టీపైనే తీవ్ర విమర్శలు గుప్పిస్తూ తిరుగుబాటుదారుగా ముద్రవేసుకున్నారు. ఇప్పుడు రాజీనామా రూపంలో పార్టీతో అనుబంధాన్ని తెంచుకున్నారు. ముఖ్యమంత్రి నుంచి కేంద్ర మంత్రివరకూ వివిధ హోదాల్లో కొనసాగిన ఆజాద్‌ రాజకీయ ప్రస్థానం ఇదీ.

బూత్‌ స్థాయి నుంచి..
1949లో జమ్ముకశ్మీర్‌ దోడా జిల్లా భదర్వాలోని సోటి గ్రామంలో ఆజాద్‌ జన్మించారు. బూత్‌ స్థాయి నుంచి కాంగ్రెస్‌లో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1973 నుంచి 1975వరకు బ్లాక్‌ కాంగ్రెస్‌ కమిటీ కార్యదర్శిగా పనిచేసిన ఆయన.. 1976 కల్లా జమ్ముకశ్మీర్‌ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఎదిగారు. సంజయ్‌ గాంధీ నేతృత్వంలోని ఇండియన్‌ యూత్‌ కాంగ్రెస్‌(ఐవైసీ)లో 1977 నుంచి ప్రధాన కార్యదర్శిగా పనిచేసి.. పలుమార్లు జైలుకు వెళ్లారు. ఈ క్రమంలో 1978-79లో సుమారు 40రోజుల పాటు తిహాడ్‌ జైల్లో ఉన్నారు. సంజయ్‌ మరణం తర్వాత 1980లో ఐవైసీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. రాజీవ్‌ గాంధీ మద్దతుతో జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1980 పార్లమెంటు ఎన్నికల్లో మహారాష్ట్ర వాసిం లోక్‌సభ స్థానం నుంచి గెలిచిన ఆజాద్‌.. 1982లో ఇందిరా గాంధీ నేతృత్వంలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

మాజీ ప్రధానులు రాజీవ్‌ గాంధీ, పీవీ నరసింహారావు, మన్మోహన్‌ సింగ్‌ హయాంలలో పనిచేసిన ఆయన 1991లో తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. సుమారు యాభై ఏళ్ల రాజకీయ జీవితంలో కాంగ్రెస్‌లో ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీగా, నాలుగు దశాబ్దాలపాటు వర్కింగ్‌ కమిటీ సభ్యుడిగా, మరికొన్ని కీలక స్థానాల్లో కొనసాగిన ఆజాద్‌.. రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా, ఐదుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. 2006 నుంచి 2008 మధ్య జమ్ముకశ్మీర్‌ శాసనసభ సభ్యుడిగా రెండుసార్లు ఎన్నికయ్యారు. 2006లో జమ్ముకశ్మీర్‌ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు.

1982 నుంచి కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న ప్రతిసారి కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్‌ దిగ్గజ నేతల్లో ఒకరిగా పేరొందిన ఆజాద్‌.. 2020లో గాంధీ కుటుంబంపై తిరుగుబాటు చేశారు. పార్టీలో సంస్థాగత మార్పులు కోరుతూ ఆయన సారథ్యంలో 23 మంది సీనియర్‌ నేతలు అధిష్ఠానానికి వ్యతిరేకంగా ధిక్కారస్వరం వినిపించారు. రాహుల్‌ గాంధీకి పార్టీ బాధ్యతలు అప్పజెప్పినప్పటి నుంచి పరిస్థితులు మరింత దిగజారాయని పేర్కొంటూ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు.

ఇవీ చదవండి: భారత ప్రధాన న్యాయమూర్తుల్లో 9 మంది దక్షిణాది వారే

కొత్త పార్టీ ఏర్పాటు దిశగా గులాం నబీ ఆజాద్

Last Updated : Aug 27, 2022, 9:52 PM IST

ABOUT THE AUTHOR

...view details