పార్టీ కీలక నేత జ్యోతిరాధిత్య సింధియా తిరుగుబాటుతో మధ్యప్రదేశ్... రెబల్ ఎమ్మెల్యేల కారణంగా కర్ణాటక... సొంత నేతల రాజీనామాతో పుదుచ్చేరి.... ఇలా అధికారంలో ఉన్న రాష్ట్రాలను కోల్పోవడం కాంగ్రెస్‌కు ఆనవాయితీగా మారిపోయింది! వారం క్రితం పంజాబ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో దక్కిన విజయాన్ని ఆస్వాదించేలోపే కేంద్ర పాలిత ప్రాంతంలో అధికారాన్ని కోల్పోయింది. సొంత నేతలే పార్టీకి షాక్ ఇస్తూ ప్రభుత్వాన్ని కూలదోసే కార్యక్రమానికి ఆద్యులుగా మారడం వల్ల.. పుదుచ్చేరిలో చతికిలపడిపోయింది కాంగ్రెస్.
2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత క్రమంగా గ్రాఫ్ కోల్పోతోంది హస్తం పార్టీ. దాదాపు అన్ని ఎన్నికల్లో డీలా పడింది. ప్రస్తుతం రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లో కాంగ్రెస్ భాగస్వామ్యంలోని కూటమి అధికారంలో ఉన్నా.. ఆయా రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి రెండు, మూడు స్థానాలకే పరిమితం.
సొంత నేతలతోనే తలనొప్పి
అంతర్గత సమస్యలే 'హస్తం'కు ముల్లులా గుచ్చుకుంటున్నాయి. సొంత నేతలే కాంగ్రెస్ పాలిట శత్రువులుగా మారుతున్నారు. పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన సింధియా.. మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని అవలీలగా కూలదోశారు. ఆ రాష్ట్రంలో పట్టు కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ మరింత బలహీనంగా మారిపోయింది. దిల్లీ, బిహార్ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
ఇదీ చదవండి:కొరవడిన నాయకత్వం... బలహీనమవుతున్న హస్తం పార్టీ..!
దేశ రాజధానిలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పనితీరు మరీ తీసికట్టుగా ఉంది. మొత్తం 70 స్థానాలు ఉంటే అందులో 67 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయంటే ఆ పార్టీ ఏ మేరకు పోటీ ఇచ్చిందో అర్థమవుతోంది. 'మహాగట్బంధన్'లో భాగంగా బిహార్ బరిలో దిగిన కాంగ్రెస్.. గత ఎన్నికలతో పోలిస్తే 9 స్థానాలు తక్కువగా గెలుచుకుంది.
ఇన్ని ప్రతికూలతల మధ్య కాంగ్రెస్‌కు ఊరటనిచ్చే అంశం ఏదైనా ఉంది అంటే అది రాజస్థాన్‌లోనే. అప్పటివరకు రాజస్థాన్ ఉపముఖ్యమంత్రిగా ఉన్న కాంగ్రెస్ కీలక నేత సచిన్ పైలట్.. సొంత ప్రభుత్వంపై ఎదురుతిరిగారు. అశోక్ గహ్లోత్ సర్కార్‌ను దాదాపుగా కూల్చినంత పని చేశారు. కానీ, గహ్లోత్‌తో పాటు కాంగ్రెస్ అధిష్ఠానం అప్రమత్తమై.. ప్రభుత్వాన్ని 'చే'జారకుండా అడ్డుకున్నారు. అయితే పైలట్, గహ్లోత్ మధ్య విభేదాలు ఇప్పటికీ తొలగిపోలేదని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
నాలుగు రాష్ట్రాల్లోనైనా..?
ఇలా నైతిక స్థైర్యం తీవ్రంగా దెబ్బతిన్న హస్తం పార్టీ వచ్చే ఎన్నికలపై ఆశలు పెట్టుకుంది. బంగాల్, తమిళనాడు, అసోం, కేరళలో మెరుగైన ప్రదర్శన చేయాలని భావిస్తోంది. పార్టీ బేస్‌ను విస్తృతం చేయాలని అనుకుంటోంది. అయితే ఇదంత సులభంగా జరిగిపోయే విషయమేం కాదు. భాజపా దూకుడు, ఎంఐఎం రంగంలోకి దిగడం పార్టీకి అతిపెద్ద అవరోధాల్లా మారాయి.