Congress Election Manifesto Committee 2024 : సార్వత్రిక ఎన్నికలకు పార్టీ ఎన్నికల ప్రణాళికను రూపొందించేందుకు కాంగ్రెస్ మేనిఫేస్టో కమిటీని ప్రకటించింది. 16మందితో కూడిన ఈ కమిటీకి ఛైర్మన్‌గా మాజీ కేంద్రమంత్రి పి. చిదంబరంను నియమించింది. కన్వీనర్‌గా ఛత్తీస్‌గఢ్ మాజీ ఉప ముఖ్యమంత్రి టి.ఎస్ సింగ్‌దేవ్ వ్యవహరిస్తారు. ఈ మేరకు శుక్రవారం ఈ జాబితాను విడుదల కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది.
మేనిఫెస్టో కమిటీ సభ్యులుగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఆనంద్ శర్మ, జైరామ్ రమేశ్, శశిథరూర్ ఉన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం గురువారం దిల్లీలో జరిగింది. ఆ మర్నాడే ఎన్నికల మేనిఫెస్టో కమిటీని ఏర్పాటుచేయడం విశేషం.
పార్టీ నేతలపై రాహుల్ ఆగ్రహం
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ రాష్ట్ర విభాగాలు అనుసరించిన వ్యూహాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. వాటిలో చిన్న పార్టీలతో సీట్ల సర్దుబాటుకు తమ పార్టీ అంగీకరించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఈ మూడు కీలక రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ పరాజయం పాలవడంపై దిల్లీ వేదికగా గురువారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో చర్చ జరిగింది.