Congress election campaign: దేశంలో కరోనా మహమ్మారి బీభత్సం రోజురోజుకు అధికమవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాల్లో ఎలాంటి పెద్ద ర్యాలీలు నిర్వహించకూడదని నిర్ణయించింది. ఇకపై వర్చువల్ ర్యాలీలే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
Congress public rallies hold: యూపీ ప్రదేశ్ కాంగ్రెస్ నేతలతో ఏఐసీసీ సీనియర్ నేతలు చర్చించి.. ప్రజా భద్రత దృష్ట్యా బహిరంగ ర్యాలీలు నిర్వహించకూడదని నిర్ణయం తీసుకున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక నుంచి సామాజిక మాధ్యమాలు, వర్చువల్ మీడియాలోనే ప్రచారం నిర్వహించడంపై దృష్టి సారించనున్నామని పేర్కొన్నాయి. పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపుర్లోనూ ఇదే తరహా విధానాన్ని అనుసరించనున్నామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణు గోపాల్ తెలిపారు.
"ఉత్తర్ప్రదేశ్ సహా ఎన్నికలు జరగనున్న ఇతర రాష్ట్రాల్లో పెద్ద ర్యాలీలు నిర్వహించకూడదని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. కరోనా పరిస్థితిని పరిశీలిస్తూ.. ర్యాలీలు నిర్వహణపై నిర్ణయం తీసుకోవాలని ఆయా రాష్ట్రాల పార్టీ విభాగాలను మేం కోరాం."
-కేసీ వేణు గోపాల్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి.