కేంద్రం, రైతుల మధ్య చర్చలు ఫలించడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదని అన్నారు కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్. కర్షకులతో భేటీ ఫలప్రదం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేసిన ఆయన.. వ్యవసాయ చట్టాలు ఏళ్లుగా ఉన్న రైతుల డిమాండ్ ఆధారంగా తీసుకొచ్చినవేనని తెలిపారు.
"చర్చలు సఫలం కావాలని కాంగ్రెస్ కోరుకోవడం లేదు. రైతుల సమస్యలు పరిష్కారమవడం ఆ పార్టీకి ఇష్టం లేదు. అందుకే వాటిని అడ్డగించడానికి జిత్తులు పన్నుతోంది. కాంగ్రెస్‌ది కుటుంబ పాలన అయితే మోదీ పాలనలో అధికారం ప్రజల చేతుల్లో ఉంది."
- ప్రకాశ్ జావడేకర్, కేంద్ర మంత్రి
కర్షకులతో పదో విడత చర్చలు బుధవారం (జనవరి 20) జరగనున్నాయి. సాగు చట్టాలను విమర్శిస్తూ మంగళవారం మీడియా సమావేశంలో కేంద్రంపై ధ్వజమెత్తారు రాహుల్ గాంధీ. 'ఖేతీ కా ఖూన్' (రక్తసిక్తమైన వ్యవసాయం) అనే బుక్లెట్నూ విడుదల చేశారు. ధరలు, చైనా దురాక్రమణ సహ పలు అంశాలపై ప్రభుత్వాన్ని ట్విట్టర్లో రాహుల్ నిలదీశారు. దీనిపై ఘాటుగా స్పందించారు జావడేకర్.