లఖింపుర్ ఖేరి(Lakhimpur Kheri Violence) ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం కలిసింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, సీనియర్ నేతలు గులాం నబీ అజాద్, మల్లికార్జున ఖర్గే, ఏకే ఆంటోనీ సహా పలువురు నేతలు దిల్లీలో రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. 'మెమొరాండం ఆఫ్ ఫ్యాక్ట్స్' పేరిట ఓ వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.
"లఖింపుర్ ఖేరి ఘటనలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా నిందితుడుగా ఉన్న నేపథ్యంలో... అజయ్ మిశ్రాను తన పదవి నుంచి తొలగించాలని రాష్ట్రపతిని మేం కోరాం. లేదంటే ఈ కేసులో దర్యాప్తు న్యాయబద్ధంగా జరగదని చెప్పాము. దీనిపై ఇద్దరు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిలతో విచారణ జరిపించాలని మేం డిమాండ్ చేశాం."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
లఖింపుర్ ఘటనపై ప్రభుత్వంతో ఈరోజే చర్చిస్తానని రాష్ట్రపతి తమకు హామీ ఇచ్చారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తెలిపారు.