Congress Crowdfunding Campaign 2023 :వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ బలోపేతానికి 'డొనేట్ ఫర్ దేశ్' పేరుతో దేశవ్యాప్తంగా విరాళాలు సేకరించనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. డిసెంబరు 18న తమ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దిల్లీలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, అజయ్ మాకెన్‌లు వెల్లడించారు. అదే రోజు విరాళాల కోసం ఆన్‌లైన్ లింక్‌ను కూడా విడుదల చేయనున్నట్లు తెలిపారు.
18 ఏళ్లు దాటిన భారతీయులెవరైనా 138 రూపాయల నుంచి 1,380, 13,800 రూపాయలను విరాళంగా ఇవ్వచ్చని మాకెన్ చెప్పారు. ఇది 138 ఏళ్ల కాంగ్రెస్ ప్రస్థానాన్ని గుర్తుచేస్తుందన్నారు. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ రోజైన డిసెంబరు 28 వరకు ప్రధానంగా ఆన్‌లైన్ వేదికగా, తర్వాత క్షేత్రస్థాయిలో విరాళాల సేకరణ చేపడతామని స్పష్టం చేశారు. దాదాపు వందేళ్ల క్రితం మహాత్మాగాంధీ ప్రారంభించిన చారిత్రక తిలక్ స్వరాజ్ ఫండ్ స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు వివరించారు. డిసెంబరు 28న 10 లక్షల మందితో నాగ్‌పుర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు.
ఇదిలా ఉండగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్(ఏడీఆర్) సంస్థ ఇటీవలి గణాంకాల ప్రకారం కాంగ్రెస్ నిధుల విలువ రూ.805 కోట్లుగా ఉంది. మరోపక్క బీజేపీ నిధుల విలువ భారీ స్థాయిలో రూ.6,046 కోట్లుగా ఉంది. కాంగ్రెస్ పార్టీకి అందుతున్న విరాళాలు గత ఏడేళ్లలో తగ్గుముఖం పట్టాయి. అదే సమయంలో బీజేపీకి ప్రకటించిన కార్పొరేట్ విరాళాల మొత్తం అన్ని జాతీయ పార్టీలకు అందిన విరాళాల కంటే మూడు రెట్లు ఎక్కువ. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఆ మొత్తం 18 రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే ఎన్నికల వేళ నిధుల కొరతను అధిగమించేందుకు కాంగ్రెస్ 'క్రౌడ్ ఫండింగ్'కు ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు కూడా హస్తం పార్టీ ఇదే దారిని అనుసరించింది.