Karnataka Election Results 2023 : కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో ప్రతిపక్ష కాంగ్రెస్ దూసుకెళ్తోంది. అధికార బీజేపీ-కాంగ్రెస్ మధ్య హోరాహోరి పోటీ ఉంటుందని అంతా భావించారు. కానీ వారి అంచనాలు తలకిందులు చేస్తూ కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జేడీఎస్ చెప్పుకోదగ్గ స్థానాలతో సరిపెట్టుకునే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు రెండు జాతీయ పార్టీలు మాత్రం గెలుపుపై తమ ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదే తామేనంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
కాంగ్రెస్ కార్యకర్తల సంబరాలు
కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యంలో ఉన్న నేపథ్యంలో అధిష్ఠానం అప్రమత్తమైంది. ఎమ్మెల్యేలందరినీ వెంటనే బెంగళూరుకు రావాలని కోరింది. కాంగ్రెస్ ముందంజలో ఉండడం వల్ల ఆ పార్టీ శ్రేణుల్లో సందడి నెలకొంది. దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంతో పాటు బెంగళూరులో కార్యకర్తలు మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ శిమ్లాలోని హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భావోద్వేగానికి గురైన డీకే శివకుమార్
కర్ణాటక ఫలితాల నేపథ్యంలో ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు DK శివకుమార్ భావోద్వేగానికి గురయ్యారు. ఈ విజయం పార్టీ కార్యకర్తలు, నేతలకే చెందుతుందన్నారు. తనపై సోనియా చూపిన అభిమానాన్ని ఎప్పటికీ మరిచిపోనని శివకుమార్ తెలిపారు.
"ఈ విజయం పార్టీ శ్రేణులు, నాయకులది. వారు ఎంతో శ్రమించారు. ప్రజలు మాపై విశ్వాసం చూపారు. నాయకులు మాకు మద్దతు ఇచ్చారు. ఇది సమష్టి నాయకత్వం. మేమంతా కలిసి పనిచేశాం. నేను ఆరంభంలో చెప్పాను. మేమంతా కలవటం ఇది ఆరంభమని ఓటువేసిన రోజు చెప్పాను. కలిసి ఆలోచించటమే పురోగతి. కలసి పనిచేయటం విజయమని చెప్పాను. జైల్లో ఉన్నప్పుడు నన్ను కలవటానికి సోనియా వచ్చిన విషయం నేను మరిచిపోలేను. బీజేపీ నేతలంతా కలిసి నన్ను జైల్లో పెట్టారు."