స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా చేసే ప్రసంగంలో ప్రధానమంత్రి పలు కొత్త పథకాలపై ప్రకటనలు చేస్తున్నప్పటికీ వాటిని అమలు చేయడం లేదని కాంగ్రెస్ విమర్శించింది. అంతేకాకుండా కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను తిరిగి వెనక్కి తీసుకోకపోవడంపై విమర్శలు గుప్పించింది. గడిచిన ఏడేళ్ల నుంచి ప్రధాని ఒకేవిధమైన ప్రసంగం చేస్తున్నారని.. చిన్న, సన్నకారు రైతులతో పాటు అణగారిన వర్గాలకు ప్రభుత్వం చేస్తుందేమీ లేదని దుయ్యబట్టింది.
'స్వాతంత్ర్యదినోత్సవ ప్రసంగంలో ప్రధానమంత్రి ప్రతిఏటా కొత్త పథకాలను ప్రకటిస్తారు. కానీ, క్షేత్ర స్థాయిలో వాటి అమలు మాత్రం ఉండదు. అంతేకాకుండా నూతన సాగు చట్టాలను తీసుకురావడంతో వారిని మరింత దుర్భర పరిస్థితుల్లోకి నెట్టివేశారు' అని ప్రధాని మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే విమర్శించారు. ఇంతకుముందు ప్రభుత్వాల హయాంలో చిన్న, సన్నకారు రైతులు, అభివృద్ధిపై విమర్శలు చేస్తోన్న మోదీ.. కాంగ్రెస్ పార్టీపై నిందలు వేసినంత మాత్రాన దేశాభివృద్ధి జరగదని అన్నారు. యూపీఏ అధికారంలో ఉన్న కాలంలో రైతులకు సాగునీటి వ్యవస్థలను అందించడంతో పాటు రుణమాఫీ చేసిన విషయాన్ని మల్లిఖార్జున ఖర్గే గుర్తుచేశారు.