కాంగ్రెస్ వారసత్వ రాజకీయాల కారణంగా దేశవ్యాప్తంగా కుప్పకూలిపోతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శలు చేశారు. పుదుచ్చేరిలో ఆ పార్టీ అవినీతికి పాల్పడి.. రూ.15వేల కోట్ల సొమ్మును గాంధీ కుటుంబానికి తరలించిందని ఆరోపణలు చేశారు.
పుదుచ్చేరిలో భాజపా ఎన్నికల ర్యాలీ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తారు షా. పుదుచ్చేరిలో మెజారిటీ కోల్పోయిన కాంగ్రెస్.. ప్రభుత్వ పథకాలపై దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి నారాయణ స్వామి.. తన పాలనా కాలంలో అభివృద్ధి పనుల కన్నా.. గాంధీ కుటుంబానికి సేవ చేయడం, అవినీతి సొమ్మును తరలించడంపైనే ఎక్కువ దృష్టి సారించారని ఆరోపించారు. ఎంతో మంది సీనియర్ నాయకులు కాంగ్రెస్ను వీడుతున్నారని.. ఆ పార్టీ వారసత్వ రాజకీయాల వల్లే దేశవ్యాప్తంగా పతనం దిశగా సాగుతోందన్నారు.