కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భారత్ జోడో యాత్ర జనవరి 30న శ్రీనగర్‌లో ముగియనుంది. ఈ ముగింపు సభకు హాజరుకావాల్సిందిగా భావసారూప్యత గల 21 పార్టీలకు లేఖ రాశారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే. భాజపా మిత్రపక్షాలతోపాటు వైకాపా, ఎంఐఎం, ఏఐయూడీఎఫ్, బీజేడీ, జేడీఎస్, బీఆర్‌ఎస్, ఆప్‌లకు ఖర్గే ఆహ్వానం పంపలేదు.
"ప్రస్తుతం భారత్.. ఆర్ధిక, సామాజిక, రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పార్లమెంటు, మీడియాలో ప్రతిపక్షాల గొంతును కేంద్రం నొక్కుతోంది. ప్రజలకు నేరుగా దేశ పరిస్థితులు వివరించి.. అందరినీ ఏకం చేయడం కోసమే భారత్ జోడో యాత్ర. 3,300 కి.మీ యాత్రలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, సామాజిక విభజన, ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరచడం, సరిహద్దుల్లో పెరుగుతున్న ముప్పు వంటి అంశాలపై జోడో యాత్రలో కాంగ్రెస్ పార్టీ లెవనెత్తింది. యువత, మహిళలు, రైతులు, కార్మికులు, చిరు వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, ఉద్యమకారులు, కళాకారులు, ఆధ్యాత్మికవేత్తలు ఎదుర్కొంటున్న అంశాలపై దేశవ్యాప్త చర్చకు జోడో యాత్ర శ్రీకారం చుట్టింది. యాత్ర ప్రారంభంలో భావసారూప్యత గల ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునివ్వగా.. పలు పార్టీల ఎంపీలు, నేతలు, మేథావులు ప్రజలు హాజరయ్యారు.