కేరళకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, నీలంబుర్ నియోజకవర్గ అభ్యర్థి వీవీ ప్రకాశ్(56) మరణించారు. గుండెపోటుతో గురువారం ఉదయం ప్రాణాలు కోల్పోయారని పార్టీ వర్గాలు తెలిపాయి.
గురువారం తెల్లవారుజామున ఆయనకు గుండె సంబంధిత సమస్య తలెత్తిందని, దీంతో ఎడక్కరాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. అక్కడ ఆయన పరిస్థితి విషమించడం వల్ల మంజెరీకి తీసుకెళ్లినట్లు వెల్లడించాయి. ఉదయం 5 గంటలకు ఆయన ప్రాణాలు కోల్పోయారని స్పష్టం చేశాయి. కొన్ని నెలల క్రితమే ఆయనకు రక్తనాళాల శస్త్రచికిత్స జరిగింది.
రాహుల్ సంతాపం
ప్రకాశ్ మరణం పట్ల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో నిజాయతీతో కూడిన వ్యక్తిగా ఆయన గుర్తుండిపోతారని అన్నారు. ప్రజలకు సహాయం చేసేందుకు ఎల్లప్పుడూ ముందుండేవారని గుర్తు చేశారు. ప్రకాశ్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
యూడీఎఫ్ కూటమిలో భాగంగా నీలంబుర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు ప్రకాశ్. సీపీఎం అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే పీవీ అన్వర్‌పై పోటీ చేశారు. ప్రస్తుతం మలప్పురం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు.
కేరళ సీఎం పినరయి విజయన్, విపక్ష నేత రమేశ్ చెన్నితలా సహా పలువురు ప్రముఖులు ప్రకాశ్ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు.
కరోనాకు ఇద్దరు ఎమ్మెల్యేలు బలి
మరోవైపు, ఉత్తర్‌ప్రదేశ్‌లో కరోనా కారణంగా మరో ఎమ్మెల్యే ప్రాణాలు కోల్పోయారు. నవాబ్‌జంగ్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేసర్ సింగ్ గంగ్వార్(64).. నోయిడాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ వారంలో అక్కడ కరోనా కారణంగా మరణించిన మూడో శాసనసభ్యుడు గంగ్వార్. అంతకుముందు లఖ్‌నవూ(పశ్చిమ) ఎమ్మెల్యే సురేశ్ శ్రీవాస్తవ, ఔరేయా నియోజకవర్గ శాసనసభ్యుడు రమేశ్ చంద్ర దివాకర్ కరోనాకు బలయ్యారు.
బంగాల్లో..
తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఇటీవల భాజపాలో చేరిన ఎమ్మెల్యే గౌరీ శంకర్ దత్తా సైతం కరోనా కారణంగా మరణించారు. పది రోజుల క్రితం ఆయనకు కరోనా సోకగా అప్పటి నుంచి జిల్లా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించడం వల్ల కోల్‌కతాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే.. ఆయన ఆరోగ్యం మెరుగుపడలేదని, ఎమ్మెల్యేకు ఇతర వ్యాధులు కూడా ఉన్నాయని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. బుధవారం రాత్రి ఆయన ప్రాణాలు కోల్పోయారని చెప్పారు.
ఇదీ చదవండి-'చస్తే మరీ మంచిది'- మంత్రి వివాదాస్పద వ్యాఖ్య