తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాంగ్రెస్​లో మార్పు.. వద్దు వద్దంటూనే మళ్లీ దోస్తీ! - కాంగ్రెస్ హిందుత్వ

2014 ఎన్నికల ఫలితం తర్వాత సాఫ్ట్​ హిందుత్వ విధానాన్ని అవలంబించింది కాంగ్రెస్​. ముస్లింల అనుకూల పార్టీ అన్న ముద్రను తొలగించుకునేందుకు ముస్లిం పార్టీలకు దూరంగా ఉంటూ వచ్చింది. కానీ ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయా రాష్ట్రాల్లోని 'ముస్లిం పక్షాల'తో కాంగ్రెస్ జట్టు కడుతోంది.

congress alliance with muslim parties ahead of five state assembly elections
వద్దు.. వద్దంటూనే దోస్తీ!- కాంగ్రెస్‌ హిందుత్వ వైఖరి

By

Published : Apr 2, 2021, 8:35 AM IST

Updated : Apr 2, 2021, 1:38 PM IST

ముస్లింల అనుకూల పార్టీ అన్న ముద్రను తొలగించుకునేందుకు ఇన్నాళ్లూ సాఫ్ట్‌ హిందుత్వ వైఖరిని అనుసరించిన కాంగ్రెస్‌.. ఇప్పుడు దానికి కాస్త దూరం జరిగినట్లు కనిపిస్తోంది. వద్దువద్దనుకుంటూనే, తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని 'ముస్లిం పక్షాల'తో ఆ పార్టీ జట్టు కడుతోంది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పశ్చిమ బంగాల్‌లో ఇండియన్‌ సెక్యులర్‌ ఫ్రంట్‌ (ఐఎస్‌ఎఫ్‌)తో, అసోంలో ఏఐయూడీఎఫ్‌తో దోస్తీలను ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

2014 నాటి పరాభవంతో మార్పు

2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర పరాజయాన్ని చవిచూసింది. దేశవ్యాప్తంగా కేవలం 44 లోక్‌సభ స్థానాలకు పరిమితమైంది. ఆ పరాభవంపై అధ్యయనం చేసిన ఏకే ఆంటోనీ కమిటీ.. కాంగ్రెస్‌ను ముస్లింల పార్టీగా ప్రజల ముందు చిత్రీకరించడంలో భాజపా విజయవంతమైనట్లు గుర్తించింది. దాని ఫలితంగానే హస్తం పార్టీకి ఎన్నికల్లో దారుణ ఫలితాలు ఎదురయ్యాయని తేల్చింది. ఆ తర్వాతి నుంచి కాంగ్రెస్‌ తీరులో మార్పు వచ్చింది. సాఫ్ట్‌ హిందుత్వ విధానాన్ని అవలంబించడం ప్రారంభించింది. పార్టీ నేతలు ఇఫ్తార్‌ విందులు ఇవ్వడం దాదాపుగా మానేశారు! అగ్ర నేత రాహుల్‌ గాంధీ నుదుటన బొట్టు పెట్టుకొని ఆలయాలకు వెళ్లడం మొదలుపెట్టారు. 2017 గుజరాత్‌ ఎన్నికల సమయంలో ఆయన తన జంధ్యాన్ని బయటకు చూపించారు.

2018లో కైలాస్‌ మానసరోవర్‌ను సందర్శించారు. అదే ఏడాది చివర్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. తనది దత్తాత్రేయ గోత్రమని చెప్పుకొన్నారు. తర్వాత మహారాష్ట్రలో హిందూ పార్టీగా గుర్తింపు పొందిన శివసేనతో ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడం మరో కీలక పరిణామం. తాజా ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్‌ వైఖరిలో మార్పు కనిపిస్తోంది.

బంగాల్‌: సిద్దిఖీతో కలిసి..

బంగాల్​లో ము​స్లిం మత గురువు అబ్బాస్‌ సిద్దిఖీ

బంగాల్‌లో ముస్లిం మత గురువు అబ్బాస్‌ సిద్దిఖీ నేతృత్వంలోని ఐఎస్‌ఎఫ్‌తో కాంగ్రెస్‌ చేతులు కలిపింది. అక్కడ వామపక్షాలు కూడా కాంగ్రెస్‌ మిత్రపక్షాలుగానే ఉన్నాయి. ముస్లింల ఓట్లను దక్కించుకునేందుకు ఐఎస్‌ఎఫ్‌ తమకు దోహదపడుతుందని కాంగ్రెస్‌, వామక్షాలు భావిస్తున్నాయి. ముస్లిమేతరులకు వ్యతిరేకంగా విద్వేషపూరిత ప్రసంగాలు చేశారన్న ఆరోపణలు సిద్దిఖీపై ఉన్నాయి. ఫలితంగా లౌకికవాదుల మద్దతును కాంగ్రెస్‌ కోల్పోయే ముప్పుందని విశ్లేషణలు వెలువడుతున్నాయి.

అసోం: అజ్మల్‌ అండతో..

ఏఐయూడీఎఫ్ నేత బద్రుద్దీన్‌ అజ్మల్

అసోంలో బద్రుద్దీన్‌ అజ్మల్‌ నాయకత్వంలోని ఏఐయూడీఎఫ్‌తో కాంగ్రెస్‌ జట్టు కట్టింది. ప్రధానంగా అసోంలో బంగాలీ మాట్లాడే ముస్లింల పార్టీగా దానికి పేరుంది. రాష్ట్రంలో ముస్లింలంతా తమ వెంటే ఉన్నారని ఆ పార్టీ చెబుతోంది. ఈ దఫా ఎలాగైనా అసోంలో అధికారాన్ని దక్కించుకోవాలని చూస్తున్న కాంగ్రెస్‌.. ఏఐయూడీఎఫ్‌ను కూటమిలో చేర్చుకుంది.

కేరళ: పాత మిత్రుడే

కేరళలో యూడీఎఫ్​తో

కేరళలో పరిస్థితి కాస్త భిన్నం. అక్కడ కాంగ్రెస్‌ నేతృత్వంలోని యునైటెడ్‌ డెమొక్రాటిక్‌ ఫ్రంట్‌ (యూడీఎఫ్‌)లో 'ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ (ఐయూఎంఎల్‌)' దీర్ఘకాలంగా మిత్రపక్షంగా ఉంది. కానీ కొన్నేళ్లుగా కాంగ్రెస్‌ అనుసరిస్తున్న సాఫ్ట్‌ హిందుత్వ విధానాన్ని రాష్ట్రంలో చాలామంది ముస్లింలు విమర్శిస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఆర్టికల్‌ 370 వ్యవహారాల్లో ఆ పార్టీ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందనీ ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌తో ఐయూఎంఎల్‌ పొత్తును కొనసాగించడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. దేశవ్యాప్తంగా భాజపాను దీటుగా ఎదుర్కోగల సత్తా కాంగ్రెస్‌కే ఉందని, అందుకే ఆ పార్టీతో స్నేహాన్ని కొనసాగిస్తున్నామని వారికి ఐయూఎంఎల్‌ నచ్చజెప్పుతోంది.

ఇదీ చదవండి :నేడు తమిళనాడు, కేరళలో మోదీ సుడిగాలి పర్యటన

Last Updated : Apr 2, 2021, 1:38 PM IST

ABOUT THE AUTHOR

...view details