'భారత్ జోడో యాత్ర'ను నిలిపివేసేందుకు ప్రభుత్వం "సాకులు" వెతుకుతోందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా పేరు చెప్పి యాత్రను నిలిపివేయాలని కేంద్రం చెబుతోందని మండిపడ్డారు. జోడో యాత్ర హరియాణాలోని నూహ్‌కు చేరుకోగా.. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. "ఈ యాత్ర త్వరలో కశ్మీర్‌కు చేరుకుంటుంది. ఇది ఓర్వలేని ప్రభుత్వం కొవిడ్ వ్యాప్తి చెందుతున్నందున వెంటనే యాత్రను ఆపండి అని చెబుతోంది. ఈ యాత్ర వల్ల తమకు నష్టం కలుగుతుందని భయపడుతున్న భాజపా.. మాస్క్‌లు ధరించాలని, కొవిడ్ వ్యాప్తి పెరుగుతోందని సాకులు చెబుతోంది" అంటూ ధ్వజమెత్తారు రాహుల్. "దేశానికి ఉన్న శక్తిని, సత్యాన్ని చూసి వారందరూ భయపడుతున్నారు. ఇది వాస్తవం" అని రాహుల్ అన్నారు.
భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ రాహుల్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు సైతం కేంద్రం వైఖరిపై మండిపడ్డారు. "నిన్న రాహుల్ గాంధీ లేఖ అందుకున్నారు. నేడు ప్రధాన మంత్రి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. రేపు భారత్ జోడో యాత్ర దిల్లీకి చేరుకోనుంది. ఇదంతా ఎలా సాగుతోందో ఇప్పుడు మీరే ఆలోచించండి" అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ మండిపడ్డారు. కొవిడ్‌ను అడ్డం పెట్టుకుని ప్రభుత్వం భారత్ జోడో యాత్రను టార్గెట్ చేసిందన్న జైరాం.. కర్ణాటక, రాజస్థాన్‌లో భాజపా చేస్తున్న యాత్రల మాటేంటని ప్రశ్నించారు.
భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ 'మావి రాజకీయాలు కాదు'
అయితే, కరోనాపై తాము ఎలాంటి రాజకీయాలు చేయడం లేదని మాండవీయ స్పష్టం చేశారు. "భారత్ జోడో యాత్రలో పాల్గొన్నవారిలో కొందరికి కరోనా పాజిటివ్‌గా తేలిందని నాకు తెలిసింది. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సైతం కరోనా బారిన పడ్డారు. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని నాకు రాజస్థాన్ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు లేఖ రాశారు. దీనిపై రాజకీయం చేయాలని నేను అనుకోవడం లేదు" అని పార్లమెంట్లో స్పష్టం చేశారు.
"కరోనా తొలి, రెండో వేవ్‌ల సమయంలోనూ మేం వైరస్‌పై రాజకీయాలు చేయలేదు. కానీ, వైద్య శాఖ మంత్రిగా దేశంలో కొవిడ్ వ్యాపించకుండా చూసుకోవడం నా బాధ్యత. అందుకే యాత్ర కన్వీనర్‌కు, ముఖ్యమంత్రికి లేఖ రాశా. కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని సూచించా. కానీ కొందరు ప్రత్యేకమైన వ్యక్తులు మాత్రం మాట వినడం లేదు" అని మాండవీయ పేర్కొన్నారు.
జన్ ఆక్రోశ్ యాత్రకు బ్రేక్..
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా రాజస్థాన్‌లో జరుగుతున్న 'జన్ ఆక్రోశ్ యాత్ర'ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు భాజపా పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ గురువారం తెలిపారు. రాజకీయాల కంటే తమకు ప్రజలే ముఖ్యమని.. వారి భద్రత, ఆరోగ్యమే భాజపాకు ప్రధానమని ఆయన అన్నారు. కానీ కాంగ్రెస్ జరుపుతున్న భారత్ జోడో యాత్ర మాత్రం మార్నింగ్, ఈవెనింగ్ వాక్‌లా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. రాజకీయాల కోసం ప్రజల జీవితాలతో కాంగ్రెస్ ఆడుకుంటోందని మండిపడ్డారు.