తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీ 9ఏళ్ల పాలనపై కాంగ్రెస్‌ 9ప్రశ్నలు.. 'బీజేపీ చేసిందేమీ లేదు.. ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిందే!' - congress bjp news

Congress 9 Questions : కేంద్రంలో ఎన్​డీఏ సర్కారు ఏర్పడి 9 ఏళ్లు పూర్తయినా.. వారు ఇచ్చిన హామీలు మాత్రం కార్యరూపం దాల్చలేదని కాంగ్రెస్‌ ఆరోపించింది. ప్రజలను మోసం చేసినందుకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా మోదీకి తొమ్మిది ప్రశ్నలు సంధించింది. ధరల పెరుగుదల, నిరుద్యోగం, రైతుల ఆదాయం వంటి అంశాలను ప్రస్తావిస్తూ కేంద్రంపై ధ్వజమెత్తింది.

Congress 9 Questions
Congress 9 Questions

By

Published : May 26, 2023, 8:37 PM IST

కేంద్రంలో ఎన్​డీఏ సర్కారు 9 ఏళ్ల పాలనను విమర్శిస్తూ కాంగ్రెస్​ పార్టీ ధ్వజమెత్తింది. ప్రధాని నరేంద్ర మోదీకి తొమ్మిది ప్రశ్నలు సంధించింది. ధరల పెరుగుదల, నిరుద్యోగం, రైతుల ఆదాయం వంటి అంశాలను ప్రస్తావిస్తూ హస్తం పార్టీ కేంద్రంపై విరుచుకుపడింది. ప్రజలను మోసం చేసినందుకుగాను ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేసింది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ తన భారత్‌ జోడో యాత్ర సందర్భంగా కీలక అంశాలను లేవనెత్తారని, వాటిని ఆధారంగా చేసుకుని తాము కేంద్రాన్ని 9 ప్రశ్నలు అడుగుతున్నామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ తెలిపారు. "నౌ సాల్‌.. నౌ సవాల్‌" పేరుతో ఓ బుక్‌లెట్‌ కూడా విడుదల చేశారు.

"నౌ సాల్‌.. నౌ సవాల్‌" పేరుతో బుక్‌లెట్‌ విడుదల చేస్తున్న జైరాం రమేశ్​ తదితరులు

తొమ్మిది ఏళ్ల క్రితం ఇదే రోజు ప్రధాని మోదీ అధికారం చేపట్టారని, అందుకే తమ పార్టీ 9 ప్రశ్నలు అడుగుతున్నట్లు హస్తం పార్టీ పేర్కొంది. 9 ఏళ్లలో కోట్లాది మంది యువత ఉద్యోగాలను లాక్కోవటం ద్వారా మోదీ ప్రభుత్వం విశ్వగురుగా మారిందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ట్వీట్‌ చేశారు. దీనికి గుర్తుగా 'నాకామీకే నౌ సాల్‌' అనే హ్యాష్‌ ట్యాగ్‌ ఉపయోగించారు. 9 ఏళ్లలో అసత్య ఆరోపణలతో భారతీయ జనతా పార్టీ ఎదిగిందని, దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని రాహుల్‌ ఆరోపించారు. ద్రవ్యోల్బణం, విద్వేషం, నిరుద్యోగం వంటి వైఫల్యాలకు ప్రధాని మోదీ బాధ్యత తీసుకోవాలని ట్వీట్‌ చేశారు. హ్యాష్‌ ట్యాగ్‌ ద్వారా ప్రధాని మోదీకి 9 ప్రశ్నలను రాహుల్‌ గాంధీ షేర్‌ చేశారు

Congress 9 Questions : కాంగ్రెస్‌ అడిగిన 9 ప్రశ్నలు ఇవే..

  1. దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ఎందుకు ఆకాశాన్ని అంటుతున్నాయి? సంపన్నులు మరింత ధనవంతులుగా, పేదలు మరింత నిర్భాగ్యులుగా ఎందుకు మారుతున్నారు? మోదీ.. దేశ ప్రజల ఆస్తులను తన స్నేహితులకు ఎందుకు విక్రయిస్తున్నారు?
  2. సాగు చట్టాలను రద్దు చేసినప్పుడు రైతులతో చేసుకున్న ఒప్పందాలను మోదీ సర్కార్​ ఎందుకు గౌరవించట్లేదు? కనీస మద్దతు ధరకు కేంద్రం.. చట్టబద్ధత ఎందుకు ఇవ్వట్లేదు?
  3. మీ స్నేహితుడు అదానీ ప్రయోజనాల కోసం ఎల్‌ఐసీ, ఎస్‌బీఐలో ఉన్న ప్రజల కష్టార్జితాన్ని ఎందుకు రిస్క్‌లో పెట్టారు? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్న అవినీతిపై మౌనంగా ఎందుకు ఉంటున్నారు?
  4. మీరు క్లీన్‌చిట్ ఇచ్చినా.. చైనా ఎందుకు ఇంకా భారత భూభాగాలను ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తోంది? 18 సార్లు చర్చలు జరిగాయి అంటున్నారు.. మరి ప్రతిష్టంభన ఎందుకు కొనసాగుతోంది?
  5. ఎన్నికల లబ్ధి కోసం విద్వేష రాజకీయాలను ఉపయోగించుకుంటున్నారెందుకు? సమాజంలో భయానక వాతావరణాన్ని ఎందుకు సృష్టిస్తున్నారు?
  6. మహిళలు, దళితులు, మైనార్టీలపై జరుగుతున్న దాడులపై ఎందుకు మౌనంగా ఉంటున్నారు? సామాజిక న్యాయ పునాదులను ఎందుకు నాశనం చేస్తున్నారు?
  7. భారత రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య సంస్థలను ఎందుకు బలహీన పరుస్తున్నారు? ప్రతిపక్ష నేతలపై ప్రతీకార రాజకీయాలను ఎందుకు ప్రయోగిస్తున్నారు? ధనబలంతో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను ఎందుకు కూలుస్తున్నారు?
  8. పేదలకు అందించే సంక్షేమ పథకాలకు బడ్జెట్‌ను తగ్గించి కఠిన నిబంధనలు తీసుకొచ్చారు. మరి వాటిని ఎందుకు బలహీనపరుస్తున్నారు?
  9. దేశంలో ఉన్నట్టుండి లాక్‌డౌన్‌ విధించడం వల్ల నష్టపోయిన లక్షలాది మంది వలస కార్మికులకు సాయమేది? కొవిడ్ బాధిత కుటుంబాలకు ఎందుకు పరిహారం ఇవ్వట్లేదు?

ఈ ప్రశ్నలకు ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్‌ డిమాండ్ చేసింది. అంతేగాక.. ఈ తొమ్మిదేళ్లలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసినందుకుగానూ ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలంది. మే26వ తేదీని కేంద్ర ప్రభుత్వం 'మాఫీ దివస్‌'గా నిర్వహించాలని హస్తం పార్టీ నిర్ణయించింది.

35 నగరాల్లో కాంగ్రెస్​ ప్రెస్​మీట్​లు..
తొమ్మిదేళ్ల పాలనలో మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపేందుకు రాబోయే కొద్దిరోజుల్లో 35 నగరాల్లో 'నౌ సాల్.. నౌ సవాల్' పేరుతో విలేకరుల సమావేశాలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ శుక్రవారం తెలిపింది. ఈ ప్రెస్​మీట్​ల షెడ్యూల్​ను కాంగ్రెస్​ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్​ ట్విట్టర్​లో షేర్​ చేశారు.

మోదీ హయాంలో అన్ని రంగాల్లో అభివృద్ధి: బీజేపీ
ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టి శుక్రవారానికి తొమ్మిదేళ్లు పూర్తైన సందర్భంగా బీజేపీ పలు చోట్ల ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. ఈ సందర్భంగా కమలం పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మీడియాతో మాట్లాడారు. మోదీ నాయకత్వంలో భారత్​.. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని ఆయన కొనియాడారు. భారతదేశ మూలాలను బలోపేతం చేయడమే కాకుండా.. అభివృద్ధిపై తమ ప్రభుత్వంపై శ్రద్ధ చూపిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ సహా భారతీయ జనతా పార్టీ సీనియర్ నేతలు, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు.

తొమ్మిదేళ్ల పాటు మోదీ ప్రభుత్వం.. సుస్థిరమైన అభివృద్ధి కోసం అంకితమై పని చేసిందని బుక్​లెట్​లో బీజేపీ చెప్పింది. అభివృద్ధి విషయంలో ఇంతకముందు ప్రభుత్వంలా కాకుండా.. మోదీ సర్కార్​ సమగ్ర అభివృద్ధి సంస్కృతిని తీసుకువచ్చిందని పేర్కొంది. పౌరులందరికీ సమానత్వం, అవకాశాలను సృష్టించే విషయంలో బీజేపీ సర్కార్ నిబద్ధతగా ఉందని తెలిపింది. వారణాసిలోని కాశీ విశ్వనాథ్ కారిడార్, ఉజ్జయినీలోని మహాకాళ్ లోక్ ప్రాజెక్టులు, అయోధ్యలో రామ మందిర నిర్మాణంతో పాటు మరికొన్ని విషయాల గురించి బుక్​లెట్​లో వివరించింది.

పంచభూతాల్లో కాంగ్రెస్​ అవినీతి!
కాంగ్రెస్​ పార్టీపై బీజేపీ నాయకుడు రవిశంకర్​ ప్రసాద్ విమర్శలు గుప్పించారు. పంచభూతాలన్నింటిలో హాస్తం పార్టీ అవినీతికి పాల్పడిందని ఆయన ఆరోపించారు. "మన శరీరం నీరు, భూమి, గాలి, ఆకాశం, అగ్ని.. ఐదు అంశాలతో నిర్మితమైంది. ఆ ఐదు అంశాల్లోనూ కాంగ్రెస్ అవినీతికి పాల్పడింది. ఆదర్శ్ స్కామ్, బోఫోర్స్ స్కామ్, 2G స్కామ్, కామన్వెల్త్, సబ్‌మెరైన్ స్కామ్, హెలికాప్టర్ స్కామ్.. వీటిలో దేని గురించి మాట్లాడాలి? కాంగ్రెస్ తనకు తానుగా నాలుగో స్థాయి గ్రేడింగ్‌ను ఎంచుకుంది. కట్, కమీషన్, కరప్షన్​, కాంగ్రెస్" అని రవిశంకర్​ ప్రసాద్​ వ్యాఖ్యానించారు.

ABOUT THE AUTHOR

...view details