నిత్యావసరాల ధరలు, ఇంధన ధరల పెరుగుదలను నిరసిస్తూ 15 రోజలపాటు ఆందోళనలు చేపట్టనుంది కాంగ్రెస్ పార్టీ(Congress News). 'జన్ జాగరణ్ అభియాన్' పేరుతో నవంబరు 14 నుంచి దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు.
"ధరలు పెరగటం వల్ల ప్రజల జీవనోపాధి దెబ్బతింటోంది. ఆర్థిక వ్యవస్థ పతనం, ఆర్థిక మాంద్యం, నిరుద్యోగ రేటు పెరుగుదల, పేదరికం, ఆకలి.. తదితర కారణాలతో ప్రజల ఆకాంక్షలు దెబ్బతింటున్నాయి."
-- కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
దేశంలో వంటనూనెల ధరలు సంవత్సర కాలంలో రెట్టింపయ్యాయని, కూరగాయల ధరలు సైతం 40-50 శాతం పెరిగాయని వేణుగోపాల్ తెలిపారు.
వంటగ్యాస్ ధర 50శాతం పెరిగి.. రూ. 900-1000కి చేరిందని, పెట్రోల్ ధర ఏడాదిన్నరలో రూ.34, డీజిల్ రూ. 24కు పెరిగిందన్నారు. ఒక్క కొవిడ్ సమయంలోనే 14కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారని.. ఉద్యోగుల జీతాల్లోనూ 50శాతం కోత పడిందని గుర్తుచేశారు.