లఖింపుర్ ఖేరి ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు 'మెమొరాండం ఆఫ్ ఫ్యాక్ట్స్' పేరిట ఓ వినతిపత్రం సమర్పించనుంది కాంగ్రెస్. ఈ మేరకు రాహుల్ గాంధీ(Rahul Gandhi), ప్రియాంకా గాంధీ వాద్రాలతో(Priyanka Gandhi Vadra) కూడిన ఏడుగురు సభ్యుల బృందానికి అపాయింట్‌మెంట్ ఇవ్వాల్సిందిగా అక్టోబర్ 9న రాష్ట్రపతికి(President of India) ఓ లేఖ రాసింది. ఈ బృందంలో రాహుల్, ప్రియాంకతో పాటు.. సీనియర్ నాయకులు ఏకే ఆంటోనీ, మల్లికార్జున్ ఖర్గే, గులాం నబీ ఆజాద్, అధిర్ రంజన్ చౌదరి, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉండనున్నారు.
"ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్ ఖేరి ఘటన దేశ ప్రజలను కదిలించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా రైతులను బహిరంగంగా బెదిరించారు. మంత్రి కుమారుడే తమపైకి వాహనం నడిపాపారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు."
-రాష్ట్రపతికి రాసిన లేఖలో కాంగ్రెస్
'ఇది మామూలు నేరం కాదు..'
లఖింపుర్ ఖేరిలో జరిగిన హింస అత్యంత విషాదకరమైనదని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్(Salman Khurshid) అన్నారు. ఈ వైఖరి ఇలాగే కొనసాగితే.. భారత ప్రజాస్వామ్యం వినాశకరంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
"ఇది కచ్చితంగా సాధారణ నేరం మాత్రం కాదు. ప్రత్యేక దుర్మార్గ వైఖరి కారణంగా జరిగిన దాడి. ప్రజాస్వామ్య నిరసన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా జరిగిన నేరం"