రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంపై మరోమారు రాజకీయ దుమారం రేగింది. ఈ ఒప్పందంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేయించాలని కాంగ్రెస్ కోరింది. రఫేల్ జెట్లను తయారు చేసే డసో సంస్థ.. కొందరు మధ్యవర్తులకు ముడుపులు చెల్లించిందన్న వార్తలపై ప్రధాని జవాబు చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ వాదనల్ని తోసిపుచ్చిన భాజపా... విపక్షంపై ఎదురుదాడికి దిగింది.
రాహుల్ అన్నదే నిజమైంది!
2016లో రఫేల్ ఒప్పందం జరిగిన తర్వాత విమాన తయారీదారు 'డసో' సంస్థ మధ్యవర్తిగా వ్యవహరించిన భారత కంపెనీ 'డిఫ్సిస్' సొల్యూషన్స్‌కు రూ.9 కోట్ల 48లక్షలు చెల్లించిందని ఫ్రెంచ్ అవినీతి నిరోధక సంస్థ దర్యాప్తులో తేలినట్లు ఫ్రెంచ్ మీడియాలో వార్తలు వచ్చాయి. వీటిని విమర్శనాస్త్రాలుగా మలుచుకుంది కాంగ్రెస్. రఫేల్ ఒప్పందంలో అవినీతి జరగిందని తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తరచూ చేసిన ఆరోపణలు నిజమయ్యాయని అన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా.