త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గృహలక్ష్మీ అనే కొత్త హామీని ప్రకటించింది ప్రతిపక్ష కాంగ్రెస్. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ప్రతి గృహిణికి నెలకు రూ. 2,000 చొప్పున భృతి ఇస్తామని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాగ్దానం చేశారు. దీని ద్వారా సుమారు కోటిన్నర మంది గృహిణులు లబ్ధి పొందుతారని పేర్కొన్నారు. బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నా-నాయకి కార్యక్రమంలో పాల్గొన్న ప్రియాంకగాంధీ.. ఈ హామీని ప్రకటించారు. ఏడాదికి రూ. 24,000 నగదు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. కాగా, మే నెలలో కర్ణాటక శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి.
గృహలక్ష్మీ పథకం.. ఎల్పీజీ ధర పెరుగుదల, జీవన వ్యయం నుంచి మహిళలను ఆదుకునేందుకే ప్రకటించామని ప్రియాంక తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి మహిళ.. పిల్లల బాగోగులు చూసుకుంటూ.. తన కాళ్లపై నిలబడేలా, ఆర్థిక స్వాతంత్ర్యం అందించడమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టోను విడుదల చేస్తామని చెప్పారు ప్రియాంక. మంత్రులు 40 శాతం కమీషన్లు తీసుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. కర్ణాటకలో సుమారు రూ. లక్షన్నర కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారని ఆరోపించారు. రూ. 8,000 కోట్లు అభివృద్ధి పనులు చేపడితే.. అందులో రూ. 3,200 కోట్లు కమీషన్గానే పోతాయన్నారు. పోలీసు ఉద్యోగాలు, బదిలీలు, డ్రైవింగ్ లైసెన్స్లు ఇలా ప్రతిదానికి లంచాలు తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అంతకుముందు బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న ప్రియాంకకు పార్టీ కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్ద రామయ్య పాల్గొన్నారు.
నానమ్మ, తల్లిపై ప్రియాంక గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు
మహిళలతో జరిగిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తన తల్లి సోనియా గాంధీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటలీలో పుట్టిన సోనియా గాంధీ.. 21 ఏళ్లు ఉన్నప్పుడే రాజీవ్ గాంధీతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారని చెప్పారు. పెళ్లైన మొదట్లో భారత ఆచార, సంప్రదాయలను అర్థం చేసుకునేందుకు చాలా కష్టపడ్డారని వెల్లడించారు. రాజకీయ నాయకులు ఎంత విమర్శించినా.. తన దారిని మార్చుకోలేదని వివరించారు. 76 ఏళ్ల వయసున్న ఆమె.. తన జీవితమంతా దేశం కోసమే పనిచేశారని చెప్పారు ప్రియాంక. ధైర్యవంతులైన ఇద్దరు మహిళల (నానమ్మ ఇందిరా గాంధీ, తల్లి సోనియా గాంధీ) వద్ద తాను పెరిగానని గుర్తుచేసుకున్నారు. "నేను ఎనిమిదేళ్లు ఉన్నప్పుడు ఇందిరా గాంధీ తన 33 ఏళ్ల కొడుకును పొగొట్టుకున్నారు. ఆ తర్వాత రోజే మరో కుమారుడు సంజయ్ గాంధీ మరణించారు. అయినా సరే దేశం కోసం పనిచేయడానికి వెళ్లారు. ఆమె తన చివరి క్షణం వరకు దేశం కోసమే పనిచేశారు" అని కొనియాడారు ప్రియాంక.