ప్రజల ప్రాణాలను కాపాడటంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ ఆరోపించింది. వైరస్ వ్యాప్తి కట్టడి కోసం దేశవ్యాప్త లాక్‌డౌన్ విధించాలని నిపుణులు చెబుతున్న సూచనలను పాటించాలని కోరింది. ఈ మేరకు వ్యాక్సినేషన్ కోసం కేటాయించిన బడ్జెట్‌ను కేంద్రం వినియోగించట్లేదని ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ.. ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. వ్యాక్సినేషన్ కోసం బడ్జెట్లో రూ.35,000 కోట్లు కేటాయించగా.. ప్రభుత్వం రూ.4,744 కోట్లను మాత్రమే ఖర్చు చేసిందని 'ఈటీవీ భారత్'వెలువరించినకథనాన్ని తన ట్వీట్‌కు జోడించారు.
"ప్రధాని తన అహానికి అధిక ప్రాధాన్యమిచ్చినందువల్లే.. వ్యాక్సిన్ కోసం కేటాయించిన బడ్జెట్‌ను తక్కువ వినియోగించారు. ప్రజల ప్రాణాలను తక్కువగా అంచనా వేశారు."
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
మరో ట్వీట్లో టీకాలపై జీఎస్టీ విధించడాన్ని రాహుల్ తప్పుపట్టారు. కేంద్రానికి ప్రజల ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ పన్ను వసూలు ముఖ్యమని ఎద్దేవా చేశారు. కొవిడ్ కేసులు గ్రాఫ్ పెరుగుతున్నట్లుగా ఉన్న ఓ చిన్న వీడియోను ఆయన షేర్ చేశారు.
ఆ సూచనలు పాటించాలి..
ఆగస్టు 1 నాటికల్లా దేశంలో 10 లక్షల మంది కొవిడ్ బారిన పడి మరణిస్తారని లాన్సెట్ జర్నల్ రాసిన ఓ వ్యాసాన్ని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అజయ్ మేకన్ షేర్ చేశారు. తమ పార్టీ నేతలు చెప్పినట్లుగానే కరోనా కట్టడిలో దేశవ్యాప్త లాక్‌డౌన్ విధించాలని ప్రభుత్వానికి ఐఎంఏ, లాన్సెట్ జర్నల్ సూచనలు చేశాయని పేర్కొన్నారు. వాటిని ప్రభుత్వం పాటించాలని తెలిపారు. అదే సమయంలో పేదల ఖాతాల్లో రూ.6,000 నగదును జమ చేయాలని డిమాండ్ చేశారు. లాన్సెట్ జర్నల్ ప్రచురించిన కథనాలను తమ ప్రతిష్ఠను పెంచుకునేందుకు వాడుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు అదే జర్నల్ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోందని మరో నేత జైరాం రమేశ్ ఎద్దేవా చేశారు.
ఇకనైనా మేల్కోండి..
దేశంలో కరోనా కేసులను అదుపులోకి తెచ్చేందుకు దేశవ్యాప్త లాక్‌డౌన్ పెట్టాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్.. కేంద్రాన్ని కోరింది. దీనివల్ల వైరస్ చైన్‌ను బ్రేక్ చేయడంతో పాటు కొవిడ్ రోగులకు నిరంతరాయంగా సేవలు అందిస్తున్న మెడికల్ సిబ్బందికి కొంతమేర స్వస్థత చేకూరుతుందని అభిప్రాయపడింది. కొవిడ్-19 సెకండ్ వేవ్ కారణంగా తలెత్తిన సంక్షోభం నుంచి బయటపడేందుకు ఇప్పటికైనా మేల్కోవాలంటూ ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖకు ఘాటు లేఖ రాసింది. సెకండ్‌వేవ్ వేళ ఆ శాఖ వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే తమకు ఆశ్చర్యమేస్తోందని పేర్కొంది. తమ అసోసియేషన్ నుంచి కేంద్రానికి ఇచ్చిన సలహాలు, సూచనలు పలుమార్లు బుట్టదాఖలు అయ్యాయని ఆవేదన వ్యక్తంచేసింది.