మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం తారస్థాయికి చేరుకుంది. తిరుగుబాటు ఎమ్మెల్యేలు కూడా రోజురోజుకు పెరిగిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో.. పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు వ్యతిరేకంగా ఎందుకు కూటమి కట్టాల్సి వచ్చిందో వెల్లడించారు శివసేన కీలక నేత, తిరుగుబాటు ఎమ్మెల్యే సంజయ్ శిర్సత్. ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ( ఎన్సీపీ)పై సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు గుహవాటి ఫైవ్‌స్టార్ హోటల్ నుంచి ఒక వీడియోను విడుదల చేశారు. మహారాష్ట్ర రాజకీయాల నుంచి శివసేనను దూరం చేయాలని కాంగ్రెస్, ఎన్సీపీ ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని ఎన్నోసార్లు సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు తెలియజేయడానికి ఎమ్మెల్యేలు ప్రయత్నించి విఫలమైనట్లు పేర్కొన్నారు.
"వీడియో కాన్ఫరెన్స్‌లో ఉద్ధవ్ ఠాక్రే ప్రసంగాన్ని చూశాం. ఆ స్థాయిలో సీఎం భావోద్వేగానికి లోనవుతారని అనుకోలేదు. మేము కూడా బాధపడ్డాం. తిరుగుబాటుకు దారి తీసిన కారణాలు చాలా ఉన్నాయి. ఇది ఒక్క రోజలో జరిగింది కాదు."
-సంజయ్ శిర్సత్, తిరుగుబాటు ఎమ్మెల్యే
అఘాడీ కూటమిలో చేరాక.. శివసేన మరింత దిగజారిపోయినట్లు చెప్పుకొచ్చారు సంజయ్ శిర్సత్. అందుకు ఇటీవల జరిగిన జిల్లా పరిషత్, పంచాయతీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. స్థానిక ఎన్నికల్లో శివసేన నాలుగో స్థానానికి పడిపోయినట్లు వీడియోలో వివరించారు. రెండో స్థానంలో ఎన్సీపీ, మూడోస్థానంలో కాంగ్రెస్ ఉన్నట్లు వెల్లడించారు. శివసేనను నిర్వీర్యం చేయడానికి కాంగ్రెస్, ఎన్సీపీ ప్రయత్నిస్తున్నాయనడానికి ఈ ఎన్నికలే నిదర్శనం అన్నారు.
నియోజకవర్గం స్థాయిలో కూడా ఎమ్మెల్యేలకు తగిన గౌరవం దక్కడం లేదన్నారు సంజయ్ శిర్సత్. ఎమ్మెల్యే ప్రమేయం లేకుండా తహసీల్దార్ నుంచి ఇతర అధికారుల నియామకాలు జరిగిపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అనేక విషయాలపై ఉద్ధవ్జీకి చెప్పడానికి అనేక సార్లు తిరుగుబాటు ఎమ్మెల్యేలందరూ వెళ్లినా.. ఆయన కలవలేదని చెప్పారు.