తెలంగాణ

telangana

'కింగ్​ మేకర్' ఆశలతో కూటమి అస్తిత్వ పోరు

By

Published : Mar 28, 2021, 4:27 PM IST

బంగాల్​ దంగల్​లో తృణమూల్ కాంగ్రెస్, భాజపా నువ్వా-నేనా అంటున్న క్రమంలో తాము బంగాల్​లో 'కింగ్​ మేకర్' గా మారతామని అంటోంది మహాకూటమి. తమ మద్దతు లేనిదే ఏ పార్టీ అధికారంలోకి రాలేదని ధీమా వ్యక్తం చేస్తోంది. ఇంతకీ.. మహాకూటమి నేతలు ఇంత విశ్వాసంగా ఉండడానికి కారణాలేంటి? నిజంగా హంగ్ ఏర్పడితే... తృతీయ కూటమి ఎవరి పక్షాన నిలుస్తుంది?

Cong-Left-ISF alliance fighting for political relevance, hopes to be kingmaker
బంగాల్​లో 'ఎర్ర'కోట తిరిగి నిర్మించేనా?

బంగాల్​లో అధికారం సాధించి దశాబ్దాల కలను సాకారం చేసుకోవాలని భాజపా చూస్తోంటే.. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు శ్రమిస్తోంది తృణమూల్ కాంగ్రెస్. భాజపా నుంచి గతంలో ఎన్నడూ లేనంత గట్టి పోటీని ఎదుర్కొంటోంది​. ఈ దిగ్గజాల పోరులో తమ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోన్న మహాకూటమి(వామపక్షం-కాంగ్రెస్​-ఐఎస్​ఎఫ్).. బంగాల్​లో 'కింగ్​ మేకర్​' కావాలని ఆశిస్తోంది. ఈ కల ఏమేరకు నెరవేరుతుంది? అనుకున్నట్టు జరిగితే... ప్రభుత్వం ఏర్పాటులో కూటమి ఎలాంటి వ్యూహం అనుసరిస్తుంది?

'ఎర్ర'కోట నిర్మించేనా?

స్వాతంత్ర్యానంతరం బంగాల్​ను ఆరు దశాబ్దాల పాటు సుదీర్ఘంగా పరిపాలించిన వామపక్షాలు.. గత కొన్నేళ్లుగా ఆ రాష్ట్ర​ రాజకీయాల్లో చివరి స్థానానికే పరిమితమయ్యాయి. 120 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ సైతం.. సమర్థమైన నాయకత్వం లేకపోవడం, అంతర్గత కలహాల వల్ల సతమతమవుతోంది. కొంతకాలంగా ఎన్నికల్లో వరుస దెబ్బలు తింటోంది. ఇలా చావుబతుకుల పోరాటం సాగిస్తున్న ఈ రెండు పార్టీలు... అనివార్య పరిస్థితుల్లో బంగాల్ శాసనసభ ఎన్నికల కోసం జట్టుకట్టాయి.

ప్రముఖ మత గురువు పీర్జాదా అబ్బాస్​ సిద్ధిఖీ ఇటీవల స్థాపించిన ఇండియన్​ సెక్యూలర్ ఫ్రంట్​ (ఐఎస్​ఎఫ్) కూటమిలో చేరడం కాంగ్రెస్, వామపక్షాల్లో కాస్త ఆశలు చిగురింపచేసింది. మహాకూటమి 'సంయుక్త మోర్చా'గా అవతరించింది. టీఎంసీ, భాజపా ఓట్లను కొల్లగొట్టి, రాజకీయంగా కీలక శక్తిగా ఎదగాలని ఆశిస్తోంది.

" మా కూటమి బంగాల్​ ఎన్నికల్లో 'గేమ్​ ఛేంజర్​' అవుతుందని మేము నమ్ముతున్నాము. బంగాల్​లో ద్విముఖ పోరు నడుస్తోందని భాజపా, తృణమూల్ కాంగ్రెస్ చెబుతున్నాయి. కానీ బంగాల్​లో త్రిముఖ పోరు నడుస్తోంది."

-- మహ్మద్​ సలీం​, సీపీఎం నేత

తమ కూటమి అందరూ ఆశ్చర్యపడే స్థాయిలో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్​ నేత ప్రదీప్ భట్టాచార్య.

'మైనారిటీ ఓట్లు మావే'

కూటమి నేతలు ఇంత ధీమాగా ఉండడానికి కారణం... ఐఎస్​ఎఫ్​. పీర్జాదా రాకతో బంగాల్​లో అధిక శాతం మైనారీటీ ఓట్లు తమకే దక్కుతాయన్న ఆశతో ఉంది 'సంయుక్త మోర్చా'. నిజానికి... ఉత్తర బంగాల్​లో మాత్రమే కాంగ్రెస్​కు మైనారిటీల మద్దతు ఉంది. మిగిలిన అన్ని ప్రాంతాల్లో వారి ఓట్లు టీఎంసీకే. ఇప్పుడు పీర్జాదా చేరికతో ఆయా చోట్ల కూడా మైనారిటీలు తమవైపు మళ్లొచ్చని లెక్కలేసుకుంటున్నాయి కాంగ్రెస్, వామపక్షాలు. ఇదే అంచనాతో ఉన్న భాజపా సైతం... ఐఎస్​ఎఫ్​ అరంగేట్రంపై లోలోన సంతోషపడుతోంది. మైనారిటీల్లో మమతా బెనర్జీకి ఉన్న పట్టుపై కొంతవరకైనా ఆ పార్టీ ప్రభావం చూపుతుందని ఆశిస్తోంది.

అస్తిత్వ పోరు!

2016 అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష- కాంగ్రెస్ కూటమి 36 శాతం ఓట్లు రాబట్టింది. ఆ తర్వాత కూటమి ఓట్ల శాతం గణనీయంగా తగ్గుతూ వస్తోంది. 2019 లోక్​సభ ఎన్నికల్లో ఇరు పార్టీలు వేరువేరుగా పోటీ చేశాయి. కాంగ్రెస్​కు ఏడు శాతం, వామపక్షాలకు ఐదు శాతం ఓట్లు దక్కాయి. ఆ ఎన్నికల్లో వామపక్షాలు ఖాతా తెరవలేదు. మొత్తం 42 లోక్​సభ సీట్లలో కాంగ్రెస్​ రెండింట గెలిచింది. మరోవైపు భాజపా 18 సీట్లు సాధించగా.. అధికార తృణమూల్​ కాంగ్రెస్​కు 22 సీట్లు దక్కాయి.

ఈ పరిస్థితిని ఎలాగైనా మార్చి, ప్రజల మద్దతును తిరిగి సంపాదించుకోవాలని చూస్తున్నాయి మహాకూటమిలోని ప్రధాన పార్టీలు.

"రాజకీయ అస్తిత్వం కోసం పోరాటం చేస్తున్న మాకు ప్రస్తుతం వామపక్షాలు, ఐఎస్​ఎఫ్ భాగస్వామ్యం ఎంతో అవసరం. తృణమూల్ కాంగ్రెస్ ముస్లిం ఓట్లపై, భాజపా హిందూ ఓట్లపై దృష్టి సారించాయి. వామపక్ష​, కాంగ్రెస్ నేతలకు ఎర వేయటంపైనే టీఎంసీ దృష్టి సారించటం వల్ల బంగాల్​లోకి భాజపా వచ్చేందుకు మార్గం సుగమమైంది.

రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా మతతత్వ రాజకీయాలు సాగుతున్నాయి. ఇలాంటి సమయంలో ఐఎస్​ఎఫ్​తో పొత్తు ఎంతో అవసరం. గత ఎన్నికల్లో మేము గెలిచిన 77 సీట్లలో అత్యధికం... మైనారిటీలు ఎక్కువగా ఉండే ముర్షీదాబాద్, మాల్డా, ఉత్తర దినాజ్​పుర్​, దక్షిణ దినాజ్​పుర్​లోనివే. కనీసం ఆయా స్థానాలను నిలబెట్టుకోవాలంటే మేము ఐఎస్​ఎఫ్​తో పొత్తు పెట్టుకోవడం తప్పనిసరి."

--- అబ్దుల్ మన్నన్​, కాంగ్రెస్ నేత

294 నియోజకవర్గాలున్న బంగాల్​లో ఈసారి వామపక్షాలు 177 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్​ 91, ఐఎస్​ఎఫ్ 26 స్థానాల్లో బరిలోకి దిగుతున్నాయి.

సిద్ధిఖీ వ్యాఖ్యలతో చిక్కులు!

సిద్ధిఖీపై వామపక్షాలు, కాంగ్రెస్ భారీ ఆశలు పెట్టుకున్నా... గతంలో వేర్వేరు వర్గాలు, రాజకీయ పార్టీలను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు కూటమికి ప్రతికూలంగా మారతాయన్న ఆందోళనలు నెలకొన్నాయి. భాజపా ఇప్పటికే ఐఎస్​ఎఫ్​ను.. 'ముస్లిం లీగ్​'కు మరో రూపంగా అభివర్ణిస్తోంది. బంగాల్​ను విభజించేందుకే వచ్చిందని ఆరోపిస్తోంది. అయితే ఈ మచ్చను చెరిపేందుకు ఈసారి ఐఎస్​ఎఫ్ 26 మంది ఇతర మతాల వాళ్లకూ టికెట్ ఇచ్చింది.

30 స్థానాల్లో కూటమి ప్రభావం!

"టీఎంసీ, భాజపాకు దాదాపు 30 స్థానాల్లో కూటమి సెగ తప్పదు. మైనారిటీలు అధికంగా ఉండే జిల్లాల్లో టీఎంసీకి పడే ముస్లింల ఓట్లను ఐఎస్​ఎఫ్​ చీల్చుతుంది. ఉత్తర, దక్షిణ బంగాల్​లోని కొన్ని జిల్లాల్లో ఐఎస్​ఎఫ్ వల్ల భాజపాకు నష్టం జరుగుతుంది" అని అంచనా వేశారు రాజకీయ విశ్లేషకులు బిశ్వంత్ చక్రవర్తి.

అయితే.. ప్రతిపక్షాల ఓట్లను చీల్చి.. మహా కూటమి పరోక్షంగా తృణమూల్​ కాంగ్రెస్​కు సాయం చేయబోతుందని అంచనా వేశారు మరో రాజకీయ విశ్లేషకులు సుమన్​ భట్టాచార్య.

'కింగ్ మేకర్​' మేమే!

బంగాల్​లో తృణమూల్​ కాంగ్రెస్​కు ఓటు వేయటం ఇష్టంలేని మైనారిటీ ప్రజలు, భాజపాకు ఓటువేయటం ఇష్టంలేని హిందువులు.. తమ కూటమివైపు చూస్తారని సంయుక్త మోర్చా నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తమ కూటమి 'కింగ్ మేకర్​' గా అవతరించబోతుందని జోస్యం చెబుతున్నారు.

" ఎన్నికల తర్వాత బంగాల్​లో మేము కింగ్ మేకర్​గా అవతరిస్తాం. మా మద్దతు లేకుండా ఏ పార్టీ.. బంగాల్​లో అధికారంలోకి రాలేదు."

--- పీర్జాదా అబ్బాస్ సిద్ధిఖీ, ఐఎస్​ఎఫ్ అధినేత

మహారాష్ట్ర మోడల్!

బంగాల్​ శాసనసభ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాకపోతే... ప్రభుత్వం ఏర్పాటులో మహాకూటమి కీలకంగా మారుతుందని చెబుతోంది కాంగ్రెస్. మహారాష్ట్ర వ్యూహాన్ని ఇక్కడా అనుసరించే అవకాశాలు లేకపోలేదని సంకేతాలిచ్చింది.

మహారాష్ట్రలో భాజపాను అధికారంలోకి రాకుండా చేసేందుకు కాంగ్రెస్, ఎన్​సీపీ, శివసేన చేతులు కలిపాయి.

బంగాల్​లో తొలి దశలో 30 సీట్లకు మార్చి 27న పోలింగ్ జరిగింది. ఏప్రిల్ 29న చివరి(8వ) దశ ఓటింగ్ జరుగుతుంది. ఫలితం మే 2న వెలువడనుంది.

ఇదీ చదవండి :మహాకూటమి నందిగ్రామ్ అభ్యర్థిగా మీనాక్షీ ముఖర్జీ

దీదీ అస్తిత్వ పోరు- టీఎంసీకి 'చావో-రేవో'!

పూలమ్మిన చోటే.. కట్టెలమ్ముతున్న కామ్రేడ్లు!

కౌన్‌ బనేగా బంగాల్​ టైగర్‌?

ABOUT THE AUTHOR

...view details