Sonia Gandhi: రాజస్థాన్లోని ఉదయ్‌పుర్‌లో చింతన్ శివిర్ నిర్వహణకు ముందు పార్టీ నేతలకు కీలక సూచనలు చేశారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ. పార్టీని వేగవంతంగా బలోపేతం చేయడానికి నేతల సహకారం కోరిన ఆమె.. ఐక్యత, సంకల్పం, నిబద్ధత అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ మేరకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా అగ్ర నేతలతో నిర్వహించిన సీడబ్ల్యూసీ భేటీకి సోనియా అధ్యక్షత వహించారు. చింతన్ శివిర్ అనేది నామమాత్రంగా మారకూడదని చెప్పారు.
"చింతన్ శివిర్ అనేది ఒక ఆచారంగా మారకూడదు. సైద్ధాంతిక, ఎన్నికల నిర్వాహక సవాళ్లను ఎదుర్కోవడానికి పార్టీని పునర్ వ్యవస్థీకరించేలా ఉండాలి. నిస్వార్థ పని, క్రమశిక్షణే మన పట్టుదలను తెలియజేస్తాయి. పార్టీ వల్ల ప్రతి ఒక్కరికీ మేలు జరిగింది. ఇప్పుడు ఆ రుణాన్ని పూర్తి స్థాయిలో చెల్లించే సమయం వచ్చింది. మన పార్టీ వేదికల్లో ఆత్మ విమర్శ చేసుకోవడం అవసరం. అయితే ఆ విమర్శలు ఆత్మవిశ్వాసం, నైతిక స్థైర్యం క్షీణించి, వినాశకరమైన వాతావరణం వ్యాప్తి చెందే విధంగా ఉండకూడదు."
-సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు