ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది కాంగ్రెస్. మాజీ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూపై మోదీ చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖఢ్కు ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్. రాజ్యసభ కార్యాకలాపాల నిబంధనల్లోని ఆర్టికల్ 188 ప్రకారం ప్రధాని మోదీకి నోటీసులు ఇచ్చానని ఆయన తెలిపారు. నెహ్రూ కుటుంబసభ్యులు.. ముఖ్యంగా లోక్సభ సభ్యులైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రతిష్ఠను భంగం కలిగించేలా మాట్లాడారని ఆయన ఆరోపించారు. నెహ్రూ ఇంటి పేరు విషయంపై మోదీ వ్యాఖ్య.. అవమానకరంగా ఉందని చెప్పారు. సాధారణంగా తండ్రి ఇంటి పేరు కుమార్తె కొనసాగించరని.. ప్రధానికి ఆ విషయం తెలిసినా ఉద్దేశపూర్వకంగానే వారిని అవమానపరిచారని వివరించారు. ఆయన మాట్లాడిన తీరు పరిశీలిస్తే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రతిష్ఠ భంగం కలిగించాలనే మాట్లాడారని ఆరోపించారు. లోక్సభ సభ్యులైన వారిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సభా హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని వేణుగోపాల్ పేర్కొన్నారు.
నెహ్రూపై ప్రధాని మోదీ ఏమన్నారంటే..?
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యావాదలు తెలిపే తీర్మానంపై ఫిబ్రవరి 9న రాజ్యసభలో మాట్లాడిన ప్రధాని మోదీ.. నెహ్రూ కుటుంబ సభ్యులు ఆయన ఇంటి పేరును ఉపయోగించుకోవడం లేదన్నారు. ఆయన ఇంటి పేరును పెట్టుకునేందుకు కూడా ఆయన వారసులు అవమానంగా భావిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ఆయన ఇంటి పేరును పెట్టుకునేందుకు సిద్ధంగా లేని వారసులు తమను ప్రశ్నిస్తున్నారని వ్యాఖ్యానించారు.
మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లండన్లో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని పార్లమెంట్లో బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. లండన్లో రాహుల్ మాట్లాడిన వ్యాఖ్యలు భారత దేశ ప్రతిష్ఠను దిగజార్చేలా ఉన్నాయని విమర్శించారు. దీనికి ప్రతిగా కాంగ్రెస్ నేతలు కూడా ఆందోళనకు దిగారు. ఒక్కసారిగా సభలో గందరగోళ వాతావరణం ఏర్పడింది. దీంతో ఉభయసభలు మార్చి 20కి వాయిదా పడ్డాయి.