తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ రాష్ట్రాల్లో సీట్ల సర్దుబాటుపై 'హస్తం' కుస్తీ

నాలుగు రాష్టాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో జరగనున్న ఎన్నికలలో విజయం సాధించి తీరాలని కాంగ్రెస్​ ఆరాటపడుతోంది. కేంద్రంపై ఉన్న వ్యతిరేకత తమకు కలిసివస్తుందని అంచనా వేసుకుంటోంది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్​కు ఉన్న ప్రధాన సమస్య సీట్ల సర్దుబాటు. కేరళ మినహా ఇతర ప్రాంతాల్లో ఎదురవుతున్న ఈ సమస్యను కాంగ్రెస్​ ఎలా పరిష్కరించుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.

congress
సీట్ల సర్దుబాటుపై హస్తం కుస్తీ

By

Published : Mar 1, 2021, 8:20 AM IST

నాలుగు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి జరగనున్న శాసనసభ ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్‌ తహతహలాడుతున్నా.. మిత్ర పక్షాలతో సీట్లను సర్దుబాటు చేసుకోవడం కీలకంగా మారింది. వ్యవసాయ, పౌరసత్వ సవరణ చట్టాలకు వ్యతిరేకంగా ప్రజల్లో వెల్లువెత్తుతున్న నిరసనలతో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఈసారి తమకు కలిసివస్తుందని కాంగ్రెస్‌ నేతలు అంచనాలు వేసుకుంటున్నారు.

కేరళను మినహాయిస్తే అసోం, పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, పుదుచ్చేరిలలో మిత్రపక్షాలతో ఎదురవుతున్న సమస్యల్ని ఆ పార్టీ పరిష్కరించుకోవాల్సి ఉంది. బెంగాల్‌లో కొత్తగా ఏర్పాటైన ఇండియన్‌ సెక్యులర్‌ ఫ్రంట్‌ (ఐఎస్‌ఎఫ్‌)తో సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కి రాలేదు. ముస్లిం వర్గాల ఓట్ల కోసం ఈ ఫ్రంట్‌తో కలిసి వెళ్లాలని కాంగ్రెస్‌-వామపక్ష కూటమి భావిస్తోంది. అటు అసోంలో ఏఐయూడీఎఫ్‌తో ఒప్పందం ఖరారు కావాల్సి ఉంది. బద్రుద్దీన్‌ అజ్మల్‌ నేతృత్వంలోని ఈ ఫ్రంట్‌ ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రధాన భాగస్వామి. తమిళనాడులో అధికార అన్నాడీఎంకేను గద్దె దించడానికి పూర్తిగా డీఎంకేపై కాంగ్రెస్‌ ఆధారపడుతోంది. ఈసారి తమకు 50కి పైగా స్థానాలు ఇవ్వాలని ఆ పార్టీ కోరుతున్నా.. దానికి డీఎంకే సుముఖంగా లేదు.

కాంగ్రెస్‌ గతసారి ఎన్నికల్లో 41 స్థానాల్లో పోటీచేసి కేవలం 8 చోట్ల గెలవడం, ఇటీవలి ఎన్నికలను చూసినా ఓట్ల పరంగా రాణించలేకపోవడం వంటి కారణాల వల్ల ఈసారి తక్కువ స్థానాలే ఇస్తామని డీఎంకే అంటోంది. పుదుచ్చేరిలో మాత్రం ఎవరితో కలిసి వెళ్లాలనేది హస్తం తేల్చుకోలేకపోతోంది. ఇటీవల అక్కడ ప్రభుత్వం కుప్పకూలిపోవడం, భాజపా దూకుడు మీద ఉండటం వల్ల కాంగ్రెస్‌కు సరైన భాగస్వామి దొరకడం లేదు.

కనీసం ఒక రాష్ట్రంలోనైనా..

శ్రేణుల్లో నైతిక స్థైర్యాన్ని తిరిగి నింపడానికి కనీసం ఒక రాష్ట్రంలోనైనా పూర్తిస్థాయిలో గెలుపు సాధించాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. పార్టీ అగ్రనేతగా రాహుల్‌గాంధీ విశ్వసనీయతని పెంచడానికి ఈ ఎన్నికలను ఒక సాధనంగా చేసుకునే అవకాశాలున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. ముఖ్యంగా పార్టీ అధినాయకత్వంపై కొందరు సీనియర్లు వ్యక్తం చేస్తున్న భిన్నాభిప్రాయాల నేపథ్యంలో ఈ ఎన్నికలు కీలకమని వారు పేర్కొంటున్నారు. ప్రతి ఐదేళ్లకోసారి అధికారం చేతులు మారుతుండే తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఈసారి అధికారం తమకు దక్కుతుందని కాంగ్రెస్‌ వ్యూహకర్తలు ఆశాభావంతో ఉన్నారు. వచ్చే ఏడాది ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌ శాసనసభలకు జరిగే ఎన్నికల్లో విజయం సాధించాలన్నా ప్రస్తుత ఎన్నికలు కీలకమని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు.

ఇదీ చదవండి :అసోంలో కాంగ్రెస్​ ప్రచారం- రంగంలోకి ప్రియాంక

ABOUT THE AUTHOR

...view details