తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎన్నికల వేళ ఆంక్షల వలయం- హోటళ్లలోనే నేతలు

ఎన్నికల వేళ ప్రచారాలతో హోరెత్తించాల్సిన నాయకులు హోటళ్లకే పరిమితమయ్యారు. ప్రతి ఇల్లు తిరిగి ఓటేయమని అడిగే అభ్యర్థులు నిరాశ, నిస్రృహతో మూగబోయారు. జమ్ముకశ్మీర్​లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి ప్రజాస్వామ్యబద్ధంగా జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా నెలకొన్న పరిస్థితి ఇది. భాజపా, కింగ్స్ పార్టీ నేతలు మినహా మరెవ్వరూ ప్రచారం నిర్వహించకుండా చేసేందుకే ఆంక్షల పేరిట ప్రభుత్వం తమను కట్టడి చేస్తోందని ప్రత్యర్థి పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు.

Confined to hotels and unable to campaign freely, JK poll candidates ask for level playing field
ఎన్నికల వేళ హోటళ్లకే పరిమితమైన నాయకులు

By

Published : Nov 20, 2020, 6:48 PM IST

జమ్ముకశ్మీర్​లో ఆర్టికల్​ 370 రద్దు తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా తొలిసారి ఎన్నికలు నిర్వహించనున్నారు. నవంబరు 28న స్థానిక సంస్థల ఎన్నికలకు పోలింగ్​ జరగనుంది. అయితే రాజకీయ పార్టీల నుంచి మాత్రం ఎలాంటి హడావుడి లేదు. ప్రచారాలతో ఓటర్లను ఆకర్షించే కార్యక్రమాలు లేవు. ప్రసంగాలతో ఆకట్టుకునే నాయకుల మాటలే వినపడట్లేదు. తమను గెలిపించండని ప్రతి గడప తిరిగే అభ్యర్థులు నిరాశతో మౌనంగా ఉన్నారు.

దీనంతటికీ కారణం ప్రభుత్వం తమ నాయకులపై విధించిన ఆంక్షలే అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అభ్యర్థులు. ఎన్నికల ప్రచారం నిర్వహించే వీలు లేకుండా పార్టీ అధ్యక్షులను అధికారులు హోటళ్లకే పరిమితం చేశారని వాపోతున్నారు. కేవలం మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకే ప్రచారం చేయాలని చెబితే సుదూర ప్రాంతాల్లో ఉన్న తమ నాయకులు ఎలా వస్తారని ప్రశ్నిస్తున్నారు.

జమ్ముకశ్మీర్​లో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ సహా మొత్తం ఏడు పార్టీలు జట్టుకట్టి 'పీపుల్స్ అలయన్స్​ ఫర్​ గుప్కర్​ డిక్లరేషన్​(పీఏజీడీ)' కూటమిగా ఏర్పడ్డాయి. అయితే భద్రతా కారణాల దృష్ట్యా పార్టీ నాయకులను వివిధ హోటళ్లలో ఉండాలని ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ప్రభుత్వ వాహనాల్లో మాత్రమే ప్రచారం నిర్వహించాలని ఆదేశించింది. రాష్ట్రంలో శాంతి భద్రతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

కావాలనే...!

ప్రభుత్వం దురుద్దేశంతోనే పార్టీల నాయకులపై ఆంక్షలు విధించిందని ఎన్​సీ నేత నాసిర్ అస్లాం వానీ ఆరోపించారు. భాజపా, కింగ్స్​ పార్టీ(అప్నీ పార్టీ) నాయకులు, కార్యకర్తలు వ్యక్తిగత భద్రత, బుల్లెట్ ప్రూఫ్ వాహనాల్లో యథేచ్ఛగా ప్రచారం నిర్వహిస్తున్నారని తెలిపారు. మిగతా పార్టీల నాయకులకు మాత్రం ఈ సదుపాయాలు లేవని చెప్పారు. ఇదేం విధానమని ప్రశ్నించారు.

" జమ్ముకశ్మీర్​లో ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరగడం నేనెప్పుడూ చూడలేదు. కశ్మీర్​లో ఉగ్రవాదాన్ని రూపుమాపామని హోంమంత్రి అమిత్​ షా చెప్పారు. భద్రతా సమస్యలు లేవని చెబుతున్నారు. మరి ఆంక్షలు విధించడం దేనికి? ఒక వేళ పరిస్థితులు బాగా లేకపోతే ఎన్నికలు నిర్వహించడం దేనికి? రెండు నాలుకల ధోరణి సరికాదు. "

-నాసిర్ అస్లాం వానీ

ఇదీ చూడండి: 'వారి అప్రమత్తత వల్ల భారీ ఉగ్రకుట్ర భగ్నం'

ABOUT THE AUTHOR

...view details