Amit Shah Assam: సాయుధ బలగాల ప్రత్యేక అధికార చట్టాన్ని (AFSPA) అసోంలో త్వరలోనే పూర్తిగా ఎత్తివేయనున్నట్లు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. కేంద్రం, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రయత్నాల వల్ల తీవ్రవాద సంస్థలు చాలావరకు శాంతి ఒప్పందం చేసుకున్నాయని తెలిపారు. తీవ్రవాదం, హింస నుంచి అసోంకు పూర్తిగా విముక్తి లభించే రోజు ఎంతో దూరం లేదని అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. గువాహటిలో అసోం పోలీసులకు ప్రెసిడెంట్ కలర్, ప్రత్యేక ఫ్లాగ్ బహూకరించే కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు. అసోంలో ఇప్పటికే సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని 23 జిల్లాల్లో పూర్తిగా మరో జిల్లాలో పాక్షికంగా ఎత్తివేసినట్లు తెలిపారు. త్వరలోనే ఈ చట్టాన్ని అసోంలో పూర్తిగా ఎత్తివేయనున్నట్లు షా విశ్వాసం వ్యక్తంచేశారు.
టీఎంసీ సహకరించడం లేదు.. అక్రమ వలసలను పటిష్టంగా ఎదుర్కుంటున్న అసోం ప్రభుత్వాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రశంసించారు. సమస్యను పరిష్కరించడంలో బంగాల్ ప్రభుత్వం కేంద్రానికి సహకరించడం లేదని ఆరోపించారు. అసోం రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రం వెనుక బలంగా నిలబడి సమస్యపై పోరాడుతోందని, ఫలితంగా అక్రమ చొరబాట్లు గణనీయంగా తగ్గాయని షా అన్నారు. అయితే అమిత్ షా ఆరోపణలను టీఎంసీ కొట్టిపారేసింది. ప్రజల అక్రమ తరలింపు అరికట్టడం సరిహద్దు భద్రతా దళం విధి అని తెలిపింది. బీఎస్‌ఎఫ్ విధి నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగానే సరిహద్దుల్లో చొరబాట్లు, స్మగ్లింగ్ జరుగుతున్నాయని టీఎంసీ జాతీయ అధికార ప్రతినిధి సుఖేందు శేఖర్ రే అన్నారు.
అసోంలో పశువుల స్మగ్లర్లపై రాష్ట్ర ప్రభుత్వ చర్యలు కొనసాగుతాయని, గత ఏడాది కాలంలో ఇప్పటివరకు 992 మందిని అరెస్టు చేశామని, సుమారు పది వేల పశువులను రక్షించామని అమిత్ షా తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 10,700 బిగాస్ (ఎకరంలో మూడోవంతు) భూమిని ఆక్రమణదారుల నుంచి విముక్తి చేసినట్లు షా పేర్కొన్నారు.