తూర్పు లద్దాఖ్‌లో కొత్తగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్థిరత్వం కొనసాగించాలని 11వ సైనిక చర్చల్లో భారత్, చైనా నిర్ణయం తీసుకున్నాయి. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం సమస్యలను పరిష్కరించుకునేందుకు ఇరుపక్షాలు అంగీకారానికి వచ్చాయి.
శుక్రవారం జరిగిన చర్చలపై అధికారిక ప్రకటన విడుదల చేసిన భారత సైన్యం.. తూర్పు లద్దాఖ్‌లో పరిస్థితులపై అభిప్రాయాలు ఇచ్చిపుచ్చుకున్నట్లు పేర్కొంది. ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతి ఉండాలంటే సరిహద్దులో శాంతి తప్పనిసరని స్పష్టం చేసినట్లు వివరించింది. సైన్యాల మధ్య ఘర్షణను నివారించాలంటే.. బలగాల ఉపసంహరణ పూర్తి చేయాలని ఆ దేశానికి సూచించింది.
"తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి బలగాల ఉపసంహరణపై ఉన్న సమస్యలపై ఇరుపక్షాలు అభిప్రాయాలు అందించుకున్నాయి. సమస్యలను వేగంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని ఇరుపక్షాలు అంగీకారానికి వచ్చాయి. సరిహద్దులో శాంతిని పరిరక్షిస్తూ, ఎలాంటి నూతన ఘటనలు జరగకుండా.. క్షేత్రస్థాయిలో స్థిరత్వాన్ని కొనసాగించాలని నిర్ణయించాం. ఇతర ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణ జరిగితే.. సరిహద్దులో పూర్తిస్థాయిలో శాంతి నెలకొల్పే అవకాశం ఉంటుందని.. అది ద్వైపాక్షిక సంబంధాల పురోగతికి ఉపయోగపడుతుందని స్పష్టం చేశాం."