స్కిల్ కేసులో 12మంది ఐఏఎస్‌లను విచారించాలని సీఐడీకి ఫిర్యాదు
Published : Nov 2, 2023, 7:02 PM IST
|Updated : Nov 2, 2023, 7:33 PM IST
18:54 November 02
సీఐడీకి ఫిర్యాదు చేసిన న్యాయవాది ప్రసాద్
Skill Development Case: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. మొత్తం 12మంది ఐఏఎస్‌లను విచారించాలని న్యాయవాది ప్రసాద్ సీఐడీకి ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం హయాంలో సీమెన్స్ ప్రాజెక్టు అమలు, పర్యవేక్షణ కమిటీల్లోని ఐఏఎస్ అధికారుల్ని విచారణ పరిధిలోకి తీసుకురావాలని ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేసారు. అజయ్ కల్లం రెడ్డి, అజయ్ జైన్, రావత్, రవిచంద్ర, ఉదయలక్ష్మీ, ప్రేమ్ చంద్రారెడ్డి, సిసోడియా, కేవీ సత్యనారాయణ, శామ్యూల్ ఆనంద్ కుమార్, కృతిక శుక్లా, అర్జా శ్రీకాంత్, జి. జయలక్ష్మీలను విచారించాలని ప్రసాద్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుత స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి, అప్పటి సీఎండీ బంగారు రాజులతో పాటు కార్పొరేషన్‌లోని సీఎఫ్ఓ, సీఈవో, ఈడీలను విచారించాలని ఫిర్యాదులో కోరారు. కాంట్రాక్ట్, చెక్ పవర్‌తో సంబంధం ఉన్న వివిధ స్థాయిల్లోని అధికారుల్ని కూడా విచారించాలని సీఐడీకి ఫిర్యాదు చేశారు.
ఇదే కేసులో (Skill Development Case) అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు (Chandrababu) హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అనారోగ్య కారణాలరీత్యా చికిత్స నిమిత్తం మధ్యంతర బెయిలు మంజూరు చేయాలని చంద్రబాబు చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపిన హైకోర్టు.. 4 వారాల పాటు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏసీబీ కోర్టు చంద్రబాబుకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అనారోగ్య కారణాలరీత్యా చికిత్స నిమిత్తం మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని అనుబంధ పిటిషన్ వేశారు.
Chandrababu Interim Bail Conditions: చంద్రబాబుకు హైకోర్టు షరతులతో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. రూ.లక్ష చొప్పున పూచీకత్తు, ఇద్దరు షూరిటీలు సమర్పించాలని పేర్కింది. తనకు నచ్చిన ఆస్పత్రిలో సొంత ఖర్చులతో చికిత్స పొందాలన్న హైకోర్టు.. చికిత్స, ఆస్పత్రి వివరాలు జైలు సూపరింటెండెంట్‌కు సమర్పించాలని ఆదేశించింది. ఈ వివరాలను సరెండర్ అయ్యే సమయంలో సీల్డ్ కవర్‌లో సమర్పించాలని సూచిందింది. అదే విధంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా కేసును ప్రభావితం చేయరాదని.. నవంబర్ 28 సాయంత్రం 5లోగా రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ వద్ద సరెండర్ కావాలని తెలిపింది.