ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా కేరళలో ఓ వ్యక్తి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొచ్చిలో మోదీ నిర్వహించిన రోడ్‌షోలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన జరిగిందని త్రిస్సూర్‌కు చెందిన ఓ వ్యక్తి ఆరోపించారు. రోడ్‌షోలో భాగంగా మోదీ.. కారు డోర్‌కు వేలాడుతూ ప్రయాణించారని పేర్కొన్నారు. అంతేకాకుండా.. రోడ్డు కనిపించకుండా వాహనం అద్దాలపై పూలు చల్లడం కూడా నిబంధనలకు విరుద్ధమేనని తెలిపారు. జయకృష్ణన్ అనే వ్యక్తి ఈ మేరకు బుధవారం.. కేరళ డీజీపీ అనిల్‌కాంత్‌తో పాటు ఆ రాష్ట్ర మోటారు వాహన శాఖకు కంప్లైంట్ ఇచ్చారు. చట్టం అందరికీ సమానమేనని.. అందరూ నిబంధనలు పాటించాల్సిందేనని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఏప్రిల్ 24న కొచ్చిలో పర్యటించారు ప్రధాని మోదీ. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన.. వందేభారత్ రైలు, వాటర్ మెట్రో, డిజిటల్ సైన్స్ పార్క్‌లను ప్రారంభించారు. యూవం కాంక్లేవ్‌లో పాల్గొనే ముందు.. కొచ్చిలో రోడ్‌షో నిర్వహించారు మోదీ. కారు డోర్ పట్టుకొని నిల్చున్న ఆయన.. రహదారులకు ఇరువైపులా ఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. 1.8 కిలోమీటర్ల పాటు ఈ రోడ్‌షో కొనసాగింది. కేరళలో ప్రధాని మోదీ ఇంత సుదీర్ఘ ర్యాలీ చేపట్టడం ఇదే తొలిసారి. ర్యాలీ సందర్భంగా మోదీకి అనుకూలంగా నినాదాలు చేశారు ప్రజలు. ఆయనపై పూలు చల్లారు. ఏప్రిల్ 25న తిరువనంతపురంలోనూ మోదీ రోడ్‌షో నిర్వహించారు.
మోదీ ప్రయాణిస్తున్న కారుపై పూల వర్షం హోంమంత్రిపై పోలీసులకు ఫిర్యాదు
మరోవైపు, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై కర్ణాటక కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీజేపీ ర్యాలీలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. రెండు వర్గాల మధ్య శతృత్వం ఏర్పడేలా విద్వేషాన్ని వ్యాప్తి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విపక్షానికి చెడ్డపేరు వచ్చేలా మాట్లాడారని ఆరోపించారు. ఈ మేరకు కాంగ్రెస్ నేతలు రణదీప్ సుర్జేవాలా, డాక్టర్ పరమేశ్వర్, డీకే శివకుమార్.. బెంగళూరు హై గ్రౌండ్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అమిత్ షా.. కావాలనే ఈ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.
"కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అల్లర్లు చెలరేగుతాయని అమిత్ షా ఆరోపించారు. పీఎఫ్ఐపై బ్యాన్‌ను తొలగిస్తారని అన్నారు. ఈ రెండు వ్యాఖ్యలు విద్వేషాలు రెచ్చగొట్టేలా, మతసామరస్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తప్పుడు ఆరోపణలు వ్యాప్తి చేసేలా ఉన్నాయి."
-రణదీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ ప్రతినిధి
మంగళవారం బాగల్కోటె జిల్లాలోని తెరదాళలో నిర్వహించిన బహిరంగ సభలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అవినీతి తారస్థాయికి చేరుకుంటుందని అన్నారు. కుటుంబ రాజకీయాలు పెరిగిపోతాయని.. రాష్ట్రం మొత్తం అల్లర్లతో సతమతమవుతుందని చెప్పారు. 'ఇవి ఎమ్మెల్యేలు, మంత్రులకు జరిగే ఎన్నికలు కావు. ఈ రాష్ట్ర భవిష్యత్‌కు సంబంధించిన ఎన్నికలివి. కర్ణాటక భవిష్యత్‌ను మోదీకి అప్పగించండి' అని షా పిలుపునిచ్చారు.