ఉత్తర్ప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో కొవిడ్ బారినపడి ప్రాణాలు కోల్పోయిన పోలింగ్ అధికారుల కుటుంబాలకు పరిహారంపై కీలక వ్యాఖ్యలు చేసింది అలహాబాద్ హైకోర్టు. బాధితుల కుటుంబాలకు చెల్లించే పరిహారంపై పునరాలోచన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘానికి సూచించింది. వారికి ఇచ్చే పరిహారం కనీసం రూ.కోటి ఉండాలని స్పష్టం చేసింది.
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, క్వారంటైన్ నిబంధనలపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ చేపట్టింది జస్టిస్ సిద్ధార్థ వర్మ, జస్టిస్ అజిత్ కుమార్తో కూడిన ధర్మాసనం. తమ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, ఎన్నికల సంఘం పరిశీలిస్తుందనే నమ్మకం ఉందని పేర్కొంది. అలాగే తదుపరి విచారణ రోజున పూర్తిస్థాయి నివేదిక అందించాలని ఆదేశించింది.