Compensation for Swapna lok fire accident victims : సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్నిప్రమాదం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు 5 లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు ఆదేశించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మరోవైపు స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాద ఘటనపై కేసు నమోదైంది. స్వప్నలోక్ కాంప్లెక్స్ సూపర్వైజర్ ఫిర్యాదుతో సంస్థపై పలు సెక్షన్ల కింద మహంకాళి పోలీసులు కేసు నమోదు చేశారు.
స్వప్నలోక్ అగ్నిప్రమాదానికి గల కారణాలను అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి వెల్లడించారు. ఈ ప్రమాదం బిల్డింగ్ యాజమానుల నిర్లక్ష్యం వల్లే జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఘటనకు ప్రధాన కారణం షార్ట్ షర్కూట్గా భావిస్తున్నట్లు తెలిపారు. బిల్డింగ్‌లో ఫైర్ సేఫ్టీ పెట్టినా.. అవి ఏ మాత్రం పని చేయడం లేదని చెప్పారు. ఈ విషయంపై గతంలో స్వప్నలోక్ కాంప్లెక్స్ వారికి నోటీసులు ఇచ్చినా వారి తీరులో మార్పు రాలేదని తెలిపారు. ఈ ప్రమాదంలో 12 మందిని కాపాడినట్లు తెలిపిన నాగిరెడ్డి.. దురదృష్టవశాత్తు ఆరుగురు చనిపోయినట్లు ప్రకటించారు. ప్రమాదం కారణంగా 5,7 అంతస్తుల్లో ఉన్న షాపులు డ్యామేజ్ అయినట్లు వెల్లడించారు. ప్రస్తుతం బిల్డింగ్ పరిస్థితి బాగానే ఉన్నట్లు పేర్కొన్నారు.
"రాత్రి ఏడు గంటల ప్రాంతంలో స్వప్నలోక్ అగ్నిప్రమాదం గురించి మాకు సమాచారం అందింది. ఈ అగ్నిప్రమాదంలో బిల్డింగ్ లోపల చిక్కుకు పోయిన 12 మందిని కాపాడాం. దురదృష్టవశాత్తు ఆరుగురు చనిపోయారు. బిల్డింగ్‌లో సెట్ బ్యాక్స్ అనుకూలంగా ఉన్న కారణంగా ఫైర్ ఫైటింగ్ ఈజీగా చేశాం. స్వప్నలోక్ బిల్డింగ్ యజమానులకు ఫైర్ సేఫ్టీ పెట్టుకోమని చెప్పాం.. కానీ నిర్లక్ష్యం చేశారు. ఈ ఘటనలో షాపు కీపర్ల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ ప్రతి కమర్షియల్ లో తప్పనిసరిగా ఉండాలి. ఫైర్ సేఫ్టీ పెట్టుకుంటే సరిపోదు వాటి మెయింటెనెన్స్ సరిగా ఉంచుకోవాలి. ప్రధానంగా కమర్షియల్ కాంప్లెక్స్‌లు లాక్ చేయకూడదు. మృతిచెందిన వారి ప్రాంతంలో తాళాలు వేసి ఉండటంతో వారు ప్రమాదం నుంచి బయట పడలేక పోయారు. ప్రతి ఒక్క కాంప్లెక్ వారు.. లిఫ్ట్ తోపాటు.. మెట్ల దారి కూడా తెరచి ఉంచాలి. మెట్ల దారి లాక్ చేస్తే 101 కు ఫోన్ చేయండి. ఇప్పటికే నగరంలో 1150 ఎస్టాబ్లిష్ మెంట్ల అగ్నిమాపక శాఖ పరిశీలన చేసింది".-నాగిరెడ్డి, అగ్నిమాపక శాఖ డీజీ