మధ్యప్రదేశ్లో మత సామరస్యం వెల్లివిరిసింది. చనిపోయిన ఓ 90 ఏళ్ల హిందూ వృద్ధురాలికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ లేకపోవడం వల్ల ఆ ప్రాంతంలో ముస్లిం యువకులు ముందుకొచ్చారు. తల్లిలాగా ప్రేమించే ఆమె పాడెను మోసుకుని వెళ్లి హిందూ ఆచారాల ప్రకారం దహన సంస్కారాలు నిర్వహించారు.
సమాచారం ప్రకారం..
గాల్వియర్.. రైల్వేకాలనీలోని దర్గా ప్రాంతంలో నివసించే రామ్దేహి మహోర్(90) మృతిచెందింది. ఆమెకు కుమారుడు లేడు. ఉన్న ఒక్క కూతురు కూడా దిల్లీలో ఉంది. అదే ప్రాంతంలో నివసిస్తున్న ఆ వృద్ధురాలి బంధువులు ఆమెకు అంత్యక్రియలు నిర్వహించేందుకు వెనుక అడుగు వేశారు. దీంతో గాల్వియర్లో నివసిస్తున్నకొందరు ముస్లిం యువకులు ముందుకు వచ్చారు. ఆమెను తల్లిలా భావించిన మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగి షకీర్ ఖాన్ తన సోదరుడు, స్నేహితులతో కలిసి ఆమె పాడెను సిద్ధం చేశారు. హిందూ సంప్రదాయాల ప్రకారం ఆమె మృతదేహాన్ని భుజాన మోసుకుని శ్మశానవాటికకు తీసుకుని వెళ్లారు. వృద్ధురాలి అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో దిల్లీలో ఉంటున్న రామ్దేహి కుమార్తె షీలా గాల్వియర్ వచ్చారు. తల్లి చితికి ఆమె నిప్పంటించారు.