ఓ సామాన్యుడు జాక్‌పాట్ కొట్టాడు. అక్షరాల రూ.2.50 కోట్ల రూపాయల లాటరీని లక్కీ డ్రాలో కైవసం చేసుకున్నాడు. దీంతో అతడి దశ తిరిగిపోతుందని అంతా అనుకున్నారు. కానీ అతడు చేసిన ఓ చిన్న పొరపాటు వల్ల గెలిచిన సొమ్ము ప్రభుత్వ ఖజానాలోకి వెళ్లే అవకాశం ఉందట. అది తెలుసుకున్న ప్రజలు అయ్యో పాపం అంటున్నారు. ఇంతకీ లాటరీ వచ్చినట్టే వచ్చి చేజార్చుకున్న ఆ వ్యక్తి చేసిన పొరపాటు ఏంటనుకుంటున్నారా?
అధికారుల సమాచారం ప్రకారం..
పంజాబ్‌లో ఫజిల్క్ జిల్లాకు చెందిన సాక్ష్.. ఆ జాక్‌పాట్ కొట్టాడు. కానీ ఆ లాటరీపై తన ఇంటి చిరునామా సహ ఫోన్ నంబర్ రాయకపోవడం మర్చిపోయాడు. దీంతో వచ్చిన డబ్బును గెలిచిన వ్యక్తికి అప్పజెప్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు లాటరీ దుకాణ నిర్వాహకులు. ఎంతకీ అతడి జాడ దొరకకపోతే గనుక అవి చివరికి ప్రభుత్వానికి చెందే అవకాశం ఉందని తెలిపారు.
వివరాల్లేకపోతే అసాధ్యమే!
సాధారణంగా లాటరీ కొనుగోలు చేసినప్పుడు ఆ వ్యక్తికి సంబంధించి పేరు, ఇంటి చిరునామా, ఫోన్ నంబర్ వంటి పూర్తి వివరాలు రాయాల్సి ఉంటుంది. పైవన్ని కాకుండా కేవలం పేరు మాత్రమే రాస్తే కూడా విజేత గెలిచిన సొమ్మును పొందే అవకాశం ఉండదు. "సాక్ష్ అనే వ్యక్తి మా దగ్గర ఓ లాటరీ టికెట్ కొన్నాడు. లక్కీ డ్రాలో అతడికి రూ.2.50 కోట్లు వచ్చాయి. కానీ, దానిపై అతడు ఫోన్ నంబర్, అడ్రస్ రాయలేదు" అని లాటరీ దుకాణదారుడు బాబీ జవేజా తెలిపారు.
రూ.2.50 కోట్ల లాటరీ గెలుచుకున్న సామాన్యుడు అయితే విజేత పేరు మాత్రమే రాయడం వల్ల అతడిని గుర్తించడం సాధ్యం కాదని.. అయినప్పటికీ అతడి జాడ కోసం ప్రయత్నిస్తున్నామని బాబీ అన్నారు. మొత్తంగా 249092 టికెట్ నంబర్ కలిగిన వ్యక్తి తాను గెలుచుకున్న ప్రైజ్ మనీని క్లెయిమ్ చేసుకునేందుకు రూప్‌చంద్ లాటరీ కంపెనీని సంప్రదించాలని బాబీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటి నుంచి ఎవరైనా లాటరీ టికెట్‌ను కొనుగోలు చేసినప్పుడు కనీసం పేరు, ఫోన్ నంబరైనా రాయాలని.. దీంతో విజేతను సులువుగా సంప్రదించవచ్చని ఆయన అన్నారు.
విజేతకు వచ్చిన లాటరీ సంఖ్య లాటరీ క్లెయిమ్ చేసుకోకపోతే?
లాటరీ విజేత టికెట్‌పై పూర్తి వివరాలు రాయకపోయినా.. లక్కీ డ్రా సమయంలో అతడు వచ్చిన నంబర్‌తో టికెట్‌ను సరిపోల్చుకోలేకపోయినా.. ఇలా ఏ కారణంతోనైనా గెలుచుకున్న ప్రైజ్ మనీని క్లెయిమ్ చేసుకోవడానికి రాకపోతే అది నేరుగా ప్రభుత్వ ఖజానాలో జమ అవుతుంది.