ప్రభుత్వ ఉద్యోగ ఆశావాహులకు కేంద్రం శుభవార్త తెలిపింది. దేశవ్యాప్తంగా నిర్వహించాలని నిర్ణయించిన అర్హత పరీక్షపై స్పష్టతనిచ్చింది.
ఉద్యోగార్థుల కోసం కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్(సీఈటీ)ను 2022 ప్రారంభంలో నిర్వహిస్తామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. కరోనా కారణంగా ఈ ప్రక్రియ ఆలస్యమవుతోందని చెప్పారు. ఇందుకోసం ఇప్పటికే జాతీయ రిక్రూట్మెంట్ ఏజెన్సీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ఐఏఎస్ అధికారుల ఈ-బుక్ సివిల్ లిస్ట్‌ను విడుదల చేసే కార్యక్రమంలో మాట్లాడిన జితెందర్ సింగ్.. ఉద్యోగ నియామకాలకు సంబంధించి 'సీఈటీ' విప్లవాత్మక సంస్కరణ అని పేర్కొన్నారు. యువత పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని అన్నారు. దేశంలోని ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు అందించే విధంగా ఈ ఉమ్మడి పరీక్ష ఉపయోగపడుతుందని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వ అధీనంలోని నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీకి ఈ ఉమ్మడి పరీక్షను నిర్వహించాలని మోదీ సర్కారు గతంలోనే నిర్ణయించింది. ఇందుకోసం జాతీయ రిక్రూట్మెంట్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఈ పరీక్ష ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకులు, రైల్వేలలో ఖాళీలను భర్తీ చేస్తారు.
ఇదీ చదవండి:ఎస్బీఐలో 6,100 ఉద్యోగాలు- అప్లై చేయండిలా..