Common charger for all phones : ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ ఒకటే ఛార్జర్‌తో పనిచేసే విధానం దిశగా కేంద్రప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. కామన్ ఛార్జర్ తీసుకురావడంలో సాధ్యాసాధ్యాలు, ఇతర సమస్యలపై అధ్యయనానికి నిపుణుల బృందం ఏర్పాటుకు సిద్ధమైంది. ఒక్కో డివైజ్‌కు ఒక్కో రకం ఛార్జర్ కాకుండా.. అన్నింటికీ సింగిల్ ఛార్జర్ తీసుకొచ్చే అంశంపై బుధవారం నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీకి మొబైల్స్, ల్యాప్‌టాప్ తయారీదారులు; సీఐఐ, ఫిక్కీ ప్రతినిధులు; దిల్లీ ఐఐటీ, వారణాసి ఐఐటీ నిపుణులు హాజరయ్యారు.
డివైజ్‌ను బట్టి ఛార్జర్లు మారే విధానం వల్ల ఈ-వ్యర్థాలు పెరిగి పర్యావరణంపై ప్రభావం పడుతోందని తయారీదారులు సైతం అంగీకరించారని చెప్పారు రోహిత్ కుమార్ సింగ్. అయితే.. ఈ అంశంపై మరింత చర్చ జరగాల్సిన అవసరముందని వారు అభిప్రాయపడ్డట్లు వెల్లడించారు. అన్నింటికీ ఒకటే ఛార్జర్ కాకపోయినా.. తొలి దశలో రెండు రకాల ఛార్జర్ల విధానం అమల్లోకి తెచ్చే దిశగా ప్రయత్నించడం మేలని సమావేశం అనంతరం అన్నారు రోహిత్. ఇందులో సీ-టైప్ ఛార్జర్ కూడా ఒకటని చెప్పారు.
"ఇది చాలా సంక్లిష్టమైన విషయం. మనం నిర్ణయం తీసుకునే ముందు అందరి(తయారీదారులు, యూజర్లు, పర్యావరణం) వాదనల్నీ అర్థం చేసుకోవాల్సి ఉంది. భాగస్వామ్యపక్షాల్లో ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంది. వాటన్నింటినీ పరిశీలించేందుకు నిపుణుల బృందం ఏర్పాటు చేస్తాం. మొబైల్, ఫీచర్ ఫోన్స్; ల్యాప్టాప్స్, ఐప్యాడ్స్; వేరబుల్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్.. ఇలా మూడు విభాగాల్లో అధ్యయనం కోసం వేర్వేరు నిపుణుల బృందాలు ఏర్పాటు చేస్తాం. ఆయా బృందాలను ఈ నెలలోనే నోటిఫై చేస్తాం. రెండు నెలల్లో నిపుణుల బృందాలు తమ నివేదికలు అందజేస్తాయి." అని వివరించారు రోహిత్.