'జాతీయ పింఛను పథకం' (ఎన్పీఎస్) వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆర్థిక సేవల విభాగం నిబంధనల మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉపయోగపడేలా పథకాన్ని గాడిలో పెట్టేందుకు అన్ని చర్యలూ తీసుకున్నామని తెలిపింది.
'పాత పింఛను పథకం జాతీయోద్యమం'(ఎన్ఎంఓపీఎస్) దిల్లీ విభాగం అధ్యక్షుడు మన్జీత్సింగ్ పటేల్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పెట్టుకున్న ఓ దరఖాస్తు నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. దరఖాస్తులో పలు అంశాలను లేవనెత్తారు. పింఛనర్ల సంక్షేమం పట్ల మరింత బాధ్యతాయుతంగా ఉండేందుకే ప్రభుత్వం జాతీయ పింఛను విధానాన్ని తీసుకువచ్చిందని కేంద్ర ఆర్థిక మంత్రత్వశాఖ తరఫున వెలువడిన ప్రకటనలో స్పష్టం చేశారు. వినియోగదారుల ఫిర్యాదుల మేరకు ఎన్పీఎస్ కమిటీ సూచనలకు తగ్గట్లుగా పథకంలో ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తున్నట్లు తెలిపారు.